World Tribal Day : వాళ్లంతా సమాజానికి దూరంగా కొండ కోనల మధ్య జీవనం, అడవే వారి ఆవాసం. ఇదే ఆదివాసీల జీవన చిత్రం. ప్రపంచం రోజు రోజుకూ ఆధునిక కాలంలో ముందుకు దూసుకువెళుతున్న.. ఆదివాసీల జీవనం మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏబీపీ దేశం ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవులను ఆవాసంగా ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు ఆదివాసీలు. ఆదివాసీల జీవన విధానం ముఖ్యంగా పోడు భూములను సాగు చేస్తూ జీవనం కొనసాగించడం. అడవుల్లో లభించే వనమూలికలు సేకరించి విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే సంప్రదాయ బద్ధమైన ఆచార వ్యవహారాలు, భిన్నంగా ఉండే సంస్కృతి ఆదివాసీల సొంతం.
మారని బతుకులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండు, కొలామ్, ప్రధాన్, కోయ, తోటి, మన్యెవార్, ఆంద్, నాయకపోడ్ తదితర ఆదివాసీ తెగల వారు ఏజెన్సీ ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో సంప్రదాయం. ఒక్కో రకమైన ఆచార వ్యవహారాలు. అడవులకు ఆదివాసీలకు అనుసంధానంగా భిన్నమైన సంస్కృతిలో వీరి ఆచార వ్యవహారాలుంటాయి. ఆదివాసీలకు హక్కులు కల్పించేందుకు 1994 ఆగస్టు తొమ్మిదిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గుర్తించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఆదివాసీల జీవన స్థితిగతులు మాత్రం మారడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జీవనస్థితిగతులు నేటి తెలంగాణ రాష్ట్రంలోనూ అలాగే కొనసాగుతున్నాయని ఆదివాసీలు అంటున్నారు. కొమురం భీం, రాంజీగోండ్, బిర్సాముండా పోరాటాల స్ఫూర్తితో నేటికీ తాము హక్కుల కోసం పోరాడుతున్నామంటున్నారు. ఇన్నేళ్లు అయినా నేటికీ ఆదివాసీలకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆయా ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోడు పోరాటాలు
పోడు భూముల కోసం నేటికీ ఆదివాసీలు పోరాటాలు చేస్తూనే ఉన్నారని, ఏజెన్సీలో ఏ గ్రామానికి వెళ్లినా సరైన రహదారి లేక వంతెనలు లేక అనేక మారుమూల గ్రామాల్లో ఆదివాసీలు కష్టాలు పడుతున్నారు. ఇటీవలే జరిగిన కొన్ని ఘటనలు అందుకు నిదర్శనం. లింగాపూర్ మండలంలోని చోర్ పల్లి వద్ద భారీ వర్షానికి రహదారి లేక మూడు కిలోమీటర్ల మెర గర్భిణీ నడుచుకుంటూ వెళ్లి ఆపైన కుటుంబ సభ్యులు డోలిలో మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకొచ్చిన ఘటన వెలుగుచూసింది. ఇంద్రవెల్లి మండలం మామిడిగూడలో భారీ వర్షాలకు వాగు వరద ఉద్ధృతి పెరగడంతో వాగు ఒడ్డునే మహిళ ప్రసవించిన ఘటనే ఉదాహరణ. ఆదివాసీల స్థితిగతులు మారలేదనడానికి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. ఆదివాసీల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పాలకులు తమ సమస్యలను కూడా పట్టించుకోవాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు.
డోలీలే శరణ్యం
ఏపీలోని ఉత్తరాంధ్రలో ఉండే ఆదివాసీలదీ ఇదే పరిస్థితి. సరైన రోడ్లు లేక ఇప్పటికీ వారికి డోలీలే దిక్కు. గర్భిణీలు, వృద్ధులను డోలీల్లో కిలో మీటర్ల మేర మోసుకెళ్లి వైద్యం అందించాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడంలేదని ఆదివాసీలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా తమను గుర్తించి కనీస సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు. వర్షకాలం వచ్చిందంటే విషజ్వరాలు వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనని, తమకు కనీస వైద్యసౌకర్యాలు అందుబాటులో ఉండవని ఆవేదన చెందుతున్నారు.