TDP Women Leaders : వైఎస్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో వివాదంలో గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమయ్యారు. మాధవ్ న్యూడ్ వీడియో వివాదంలో టీడీపీ పోరాటం మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకుంది. ఏపీ మహిళా అఖిల పక్షం ఏర్పాటు చేసి పోరాటం సాగించాలని కూడా తీర్మానించారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఏపీ మహిళా అఖిలపక్ష సమావేశం జరిగింది. ఎంపీ గోరంట్ల మాధవ్ బూతు వీడియో బాగోతంపై చర్యలు తీసుకోకపోవడం సహా మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలను నిరసిస్తూ ఏపీ మహిళా అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గోరంట్ల మాధవ్ వంటి వారిపై చర్యలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి నేరస్థులకు అండగా నిలుస్తున్న విధానాన్ని ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం, మహిళా ఎంపీలు, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని అఖిలపక్షం నిర్ణయించింది.
వైసీపీ మినహా అన్ని పార్టీల మహిళా నేతలతో కమిటీ
టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ, లోక్ సత్తా నుంచి పలువురు మహిళా నేతలు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. వీరంతా వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో బాగోతం బయటపడి రోజులు గడుస్తున్నా నేటికీ చర్యలు తీసుకోకుండా జగన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఫోరెన్సిక్ నివేదిక పేరుతో వైసీపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత మండిపడ్డారు. స్వతహాగా నేరస్థుడైన జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో నేరస్థులకు, రేపిస్టులకు రాజకీయ పునరావాసం కల్పిస్తున్నారని, జగన్ చేతకానితనాన్ని అలుసుగా తీసుకుంటున్న వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలను చెరపడుతూ అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోరంట్ల పై చర్యలు తీసుకునే వరకూ ఉద్యమం
ప్రజా ప్రతినిధిననే విషయం మరిచి అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించిన గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోకపోగా ఆ వీడియో బాగోతం మాధవ్ ప్రైవేటు వ్యవహారమని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ విమర్శించారు. ప్రజలకు కష్టమొస్తే గన్ను కంటే ముందు వస్తాడన్న జగన్ ఎక్కడని ప్రశ్నించారు. మూడేళ్లుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న విపక్షాలపై ముందూ వెనుకా చూడకుండా అకారణంగా కేసులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం.....సొంత పార్టీ ఎంపీ నికృష్టమై వ్యవహారంలో అతన్ని రక్షించడం దుర్మార్గపు చర్య కాదా అని మహిళా నేతలు ప్రశ్నించారు.
మహిళలపై దాడుల విషయంలో కేంద్రానికి పిర్యాదు చేయాలని తీర్మానం
అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.. ప్రజా ప్రతినిధులు మహిళలను గౌరవించేలా పలు కార్యక్రమాల నిర్వహించాలని నిర్ణయించారు. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని .. గోరంట్ల మాధవ్ వీడియా కాల్ ఘటన సహా మూడేళ్లుగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులపై జాతీయ మహిళా కమిషన్ కు లేఖ , మహిళలపై అకృత్యాలు నిత్యకృత్యమైనా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మహిళా మంత్రులు, మహిళా ఎంపీలను కలిసి వివరించాలని నిర్ణయించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కిరాతకులకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలని కేంద్రాన్ని కోరాలని తీర్మానించారు. ,మహిళలపై వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పార్టీలకు అతీతంగా పోరాడటం, ట్విటర్ వేదికగా సిగ్నేచర్ క్యాంపైన్ నిర్వహణ,. అఖిలపక్ష సమావేశానికి వచ్చిన వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి బాధిత మహిళలకు అండగా నిలబడేందుకు పలు చర్యలకు శ్రీకారం చుట్టాలని తీర్మానించారు.