YSRTP Sharmila News :   తెలంగాణ రాజకీయాల్లో పొత్తులు , విలీనంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల నుంచి మిస్ డ్ కాల్స్ వస్తున్నాయని.. ప్రస్తుతం చార్జింగ్ మోడ్ లో ఉన్నామని వ్యాఖ్యానించారు. అంటే పొత్తులు విలీనాల అవకాశాల్ని పూర్తిగా కొట్టి పారేయలేదు. ఖండించలేదు. విలీనం చేయటానికి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని.. నేను వస్తానంటే ఏ పార్టీ కూడా వద్దు అని చెప్పదని.. వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగోలేదని.. 19 మంది ఎమ్మెల్యేలే గెలిస్తే.. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారని.. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని నాయకత్వం లోపం ఉందన్నారామె. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకొచ్చే సత్తా ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. 


తెలంగాణలో 43 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్‌టీపీ ప్రభావం                


జాతీయ సంస్థ చేసిన సర్వేలో తెలంగాణలో 43 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ ప్రభావం చూపిస్తుందని రిపోర్టులు వచ్చాయని షర్మిల చెబుతున్నారు.  అలాంటప్పుడు 10, 20, 30 సీట్ల కోసం పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని   ప్రశ్నించారు  . తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఏకైక పార్టీ మాదే అని.. ఎవరి దగ్గర సీట్ల కోసం తగ్గాల్సిన అవసరం లేదన్నారామె. షర్మిల అంటే తెలియని వాళ్లు ఎవరూ లేరని.. మా పార్టీ బలంగా ఉందన్నారు. తనకు మిస్ డ్ కాల్స్ వస్తున్నాయని.. ఆ విషయాలు తర్వాత వెల్లడిస్తామన్నారు వైఎస్ షర్మిల.  విలీనం చేయాలి అనుకుంటే ఎప్పుడో అది జరిగేదని.. ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు షర్మిల. 


డీకే శివకుమార్ ను కలిసిన షర్మిల


మరో వైపు కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ను షర్మిల బెంగళూరులో కలిశారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా అభినందించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే డీకే శివకుమార్ రాజకీయం చేశారని.. కష్టపడి పార్టీని గెలిపించారని.. వ్యక్తిగతంలో ఉన్న అనుబంధంతో కలిసి శుభాకాంక్షలు చెప్పినట్లు వివరించారామె. మత, కుట్ర రాజకీయాలకు చెంపపెట్టుగా బీజేపీ ఓటమిని చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల.


షర్మిల విషయంలో కాంగ్రెస్ భిన్నమైన వ్యూహంతో ఉందా  ?


దేశవ్యాప్తంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుటుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో.. షర్మిల డీకే శివకుమార్ ను కలవడం చర్చనీయాంశం అవుతోంది. ఏపీలో  రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ కు నష్టం జరిగిందని ఎక్కువ మంది చెబుతూంటారు కానీ అసలు సమస్య అంతా జగన్ పార్టీ పెట్టడం వల్లే వచ్చిందని కాంగ్రెస్ నమ్ముతోంది. ఓటు  బ్యాంక్ అంతా జగన్ వెైవువెళ్లిందని అంటున్నారు. షర్మిల ఎలాగూ జగన్ కు వ్యతిరేకంగా  బయటకు వచ్చినందున ఏపీలో షర్మిలను చేర్చుకుని పూర్తి బాధ్యతలిస్తే ఓటు బ్యాంక్ మొత్తం వెనక్కి వస్తుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో షర్మిలకు రాజకీయ భవిష్యత్ లేదని స్పష్టత వస్తుందని అప్పుడైనా ఏపీ రాజకీయాల వైపు చూడక తప్పదని కాంగ్రెస్ వ్యూహకర్తలు నమ్ముతున్నారని చెబుతున్నారు.