Headache: తలనొప్పిని సాధారణ విషయంగా చెప్పుకుంటారు. తలనొప్పి రావడం ఎక్కువమందిలోనే జరుగుతుంది, కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరిలో ఈ తలనొప్పి ప్రతిరోజూ ఒకే సమయంలో వస్తుంది, అంటే  సాయంత్రం నాలుగు గంటల సమయంలో లేదా తెల్లవారుజామున వస్తుంది. ప్రతి రోజూ ఒకే సమయానికి ఇలా తలనొప్పి రావడాన్ని క్లస్టర్ తలనొప్పి అంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రకమైన తలనొప్పి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలను ప్రభావితం చేస్తోందని వివరిస్తున్నారు. 


ఎందుకు వస్తాయి?
ప్రతిరోజు ఒకే సమయంలో వచ్చే తలనొప్పిని హిస్టమై‌న్ లేదా మైగ్రేన్ అని కూడా పిలుస్తారు. ఇది పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా దాడి చేస్తుంది.  ఈ తలనొప్పి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మీ శరీరానికి సంబంధించిన సిర్కాడియమ్ రిథమ్‌కు, ఈ తలనొప్పికి మధ్య బలమైన సంబంధం ఉంది. ఇది కార్డిసోల్, మెలటోనిన్ వంటి హార్మోన్లతో ముడిపడి ఉందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ రెండు హార్మోన్లు నిద్రను ప్రభావితం చేస్తాయి. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 71 శాతం మంది రాత్రి పూట లేదా తెల్లవారుజామున ఈ క్లస్టర్ తలనొప్పిని ఎదుర్కొన్నారని పరిశోధకులు చెప్పారు. వైద్యుల ప్రకారం క్లస్టర్ తలనొప్పి తలలో భరించలేని నొప్పిని కలిగిస్తుంది. ఇది రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు దాడి చేయవచ్చు. అర్ధరాత్రి సమయంలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కూడా తలనొప్పి వచ్చే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. 


కార్టిసాల్, మెలటోనిన్... రెండు వ్యతిరేకంగా పనిచేసే హార్మోన్లు. వీటి మధ్య అసమతుల్యత ఏర్పడినప్పుడు ఈ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. పగటిపూట నిద్రపోవడం మానుకోవాలి. శరీరం చురుగ్గా కదిలేలా పనులు చేయాలి. లేకుంటే తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి, కెఫిన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. లేకుంటే పైన చెప్పిన రెండు హార్మోన్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీనివల్ల తలనొప్పి పెరిగిపోతుంది. 


ఏం చేయాలి?
ప్రతిరోజూ ఒకే సమయానికి తలనొప్పి వస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయాలి. మీరు నిద్రపోవడానికి కనీసం రెండు మూడు గంటలు ముందు రాత్రి భోజనం పూర్తి చేయాలి. సూర్యరశ్మిలో ఉదయం పూట కనీసం అరగంటసేపు గడపాలి. దీనివల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. అలాగే ఫోన్, టీవీ వంటివి చూడడం తగ్గించాలి. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూసే వారి సంఖ్య ఎక్కువ. ఆ స్క్రీన్ సమయాన్ని తగ్గించడం అవసరం. సరైన నిద్ర పట్టడానికి పడకగది నిశ్శబ్దంగా, చీకటిగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. కాఫీ తాగడం మానేయాలి. 



Also read: ఇంట్లో మస్కిటో కాయిల్స్ వాడుతున్నారా? ఇది రోజుకు వంద సిగరెట్లు తాగడంతో సమానం


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.