Karnataka New CM: జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కర్ణాటక సీఎం పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ క్లారిటీకి వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే డీకే శివకుమార్‌ను ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్దారామయ్యవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ బయల్దేరిన ముందు డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ కూడా ఈ సమాచారానికి ఊతమిస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఓకే అంటున్న డీకే... తనకు బ్లాక్‌మెయిల్ చేసే ఉద్దేశం లేదంటున్నారు. తనకు సోనియాగాంధీయే రోల్ మోడల్ అంటూ మరో హింట్ కూడా ఇచ్చారు.
సిద్దారామయ్యకు అనుకూలంగా ఓ నిర్ణయానికి వచ్చిన హైకమాండ్ డీకేను ఎలా గౌరవిస్తుంది ఆయన వర్గీయులను ఎలా సంతృప్తి పరుస్తుంది అన్నదానిపైనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మాట్లాడేందుకు డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నట్టు సమాచారం.
Aslo Read: మాటిచ్చాను, గెలిపించాను, సీఎం పదవి ఇవ్వడం హైకమాండ్ ఇష్టం, ఢిల్లీ బయల్దేరే ముందు డీకే కామెంట్స్
అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా డీకే శివకుమార్‌కు మంచి మార్కులే ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న కేసులు పెద్ద మైనస్ అవుతున్నాయి. పార్టీ విజయానికి చాలా కష్టపడినా వాటిని కారణంగా చూపుతున్న అధిష్ఠానం ఆయనకు సీఎంగా చేయడానికి వెనుకాడుతోంది. ఆయన్ని సీఎంగా చేస్తే కేంద్రం మరిన్ని ఇబ్బందులు పాల్జేసి కర్ణాటకలో మళ్లీ ఏదైనా సమస్య తీసుకొస్తుందని కాంగ్రెస్ వాదిస్తోంది. అందుకే ఈ పరిస్థితిలో సిద్దరామయ్య లాంటి వారే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరని భావిస్తోంది.
సిద్ధరామయ్యకు సీఎంగా ఓకే చెప్పిన తర్వాత ఆయన మంత్రివర్గంలో డీకే శివకుమార్‌కు, ఆయన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేసే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఈయనతోపాటు పార్టీ విజయానికి కారణమైన మరికొన్ని వర్గాలకి కూడా డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టబోతున్నారని తెలుస్తోంది.
ఇద్దరితో ముఖాముఖీగా మాట్లాడి విషయాన్ని ఇవాళ తేల్చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఇద్దర్నీ ఢిల్లీకి పిలిచి మాట్లాడాలని నిన్న అనుకుంది. సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లినా... అనారోగ్య కారణంతో డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లకుండా ఉండిపోయారు. ఈ ఉదయం ఆయన హస్తినకు బయల్దేరారు. మధ్యాహ్నం తర్వాత ఇరువురు నేతలతో మాట్లాడి సీఎం పదవిపై క్లారిటీ ఇచ్చేయనుంది. ఇద్దరూ కలిసి కర్ణాటకలో పార్టీని బలోపేతం చేయాలని హితబోధ చేయనుంది. కర్ణాటక మరో రాజస్థాన్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్. అందుకే ఇద్దరికీ అంగీకారమైన ఫార్ములాతో సమస్యకు పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది.
కర్ణాటక ఎన్నికల్లో విజయంతో మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ మరింతగా దూసుకెళ్లాలని యోచిస్తోంది. అందుకే డీకే శివకుమార్ లాంటి వ్యూహాత్మక నేతలు అవసరమని భావిస్తోంది. 2024 ఎన్నికలపై దృష్టి పెట్టాలని ఇద్దరికీ సూచించే ఛాన్స్ ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కర్ణాటకలోని ఎంపీ స్థానాలన్నింటినీ గెలుచుకునేలా వ్యూహాన్ని రెడీ చేయాలని ఇద్దరికీ చెప్పనుంది. ఇద్దరూ కలిసికట్టుగా పార్టీ విజయానికి శ్రమించాలని హితబోధన చేయనుంది. దీన్ని చెప్పడానికే డీకేను ఢిల్లీకి పిలిపిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
Aslo Read: 135 మంది ఎమ్మెల్యేలను నేనే గెలిపించా! డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు