కర్ణాటక రాజకీయం గంట గంటకు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటివరకూ మాజీ సిద్ధరామయ్యతో కలిసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించానని చెప్పిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తొలిసారి కాస్త ధిక్కార స్వరం వినిపించారు. తన నాయకత్వంలోనే 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారంటూ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నాయకత్వంలో కాంగ్రెస్ విజయం సాధించిందన్న విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుసుని సైతం చెప్పారు. 


జాతీయ మీడియా ఏఎన్ఐతో సోమవారం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పుట్టినరోజు కావటంతో అభిమానులు, కుటుంబసభ్యులతో గడిపేందుకు ఢిల్లీకి వెళ్లడం ఆలస్యం చేశానన్నారు. ఏఐసీసీ అగ్రనేతల ఆహ్వానం మేరకు తాను సోమవారం రాత్రికి ఢిల్లీ వెళ్తున్నట్లు శివకుమార్ ప్రకటించారు. ఇప్పటికే సిద్ధరామయ్య కూడా ఢిల్లీ చేరుకోగా.. ఇప్పుడు డీకేశీ కూడా హస్తినకు వెళ్తుండటంతో కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరుకోనుంది. మరోవైపు హైకమాండ్ ప్రతిపాదనల్లో కొన్నింటిని డీకే శివకుమార్ తిరస్కరించినట్లు ఆదివారం రాత్రి ప్రచారం జరిగింది. 






‘నేను ఒంటరిని. ధైర్యంగా పోరాడితే సాధించవచ్చునని భావించాను. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో 2019లో మా ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోలేదు’ అని ఢిల్లీకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా తనకు సీఎం పదవి దక్కాలనే తీరుగా ఆయన వ్యవహరించడంతో పార్టీ హైకమాండ్ దీనిపై ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ పార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొంది.


కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ భేటీ ఆదివారం రాత్రి బెంగళూరులో రసవత్తరంగా సాగింది. కానీ ఫలితం తేలలేదు. సీఎల్పీ భేటీలో కాబోయే సీఎం ను ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్ఠానం కోరగా... ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానంతో అధిష్టానానికి ట్విస్ట్ ఇచ్చారు. కర్ణాటకు కొత్త సీఎంను ఎన్నుకోవాల్సిన బాధ్యతను కాంగ్రెస్ హై కమాండ్ కే అప్పగిస్తున్నట్లు ఎమ్మెల్యేలంతా ఏక వాక్య తీర్మానం చేయడంతో కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంను ఎంపిక చేసే అధికారం ఏఐసీసీదేనని సిద్ధరామయ్య తీర్మానం ప్రవేశపెట్టగా డీకే శివకుమార్ సహా పార్టీ ఎమ్మెల్యేలు ఏకగీవ్రంగా అంగీకారం తెలిపారు. దీంతో డీకే శివకుమార్ లేదా సిద్ధరామయ్యలో ఎవరు సీఎం కావాలనేది హైకమాండ్ నిర్ణయించనుంది.


సీఎల్పీ భేటీ అనంతరం ఎమ్మెల్యేలతో సుశీల్ కుమార్ శిండే సహా మరో ఇద్దరు కాంగ్రెస్ పరిశీలకులు వన్ టు వన్ సమావేశం అయ్యారు. సీఎంగా ఎవరు కోరుకుంటున్నారో ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయం సేకరించి, వివరాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. సీల్డ్ కవర్ లో ఆ వివరాలను ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలు పరిశీలించిన తరువాత కర్ణాటక నూతన సీఎంను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ తాను ఇప్పటివరకూ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాననంటూ డీకే శివకుమార్ ఆదివారం పలుమార్లు ప్రస్తావించారు. అర్ధరాత్రి తన పుట్టినరోజు వేడుకల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారని తెలిసిందే.