Hyderabad Liberation Day: 


లొంగిపోయిన తరవాతా నిజాంకు బాధ్యతలు..


ఆపరేషన్ పోలో విజయవంతమైంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన అంతమైపోయింది. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్ లో విలీనమై..హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. 1948-52 వరకు అంటే సార్వత్రిక ఎన్నికల జరిగే వరకూ.. హైదరాబాద్ లో పాలన నిర్వహణ అధికారులను కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపరేషన్ పోలోకి నేతృత్వం వహించిన జెఎన్ చౌదరీ 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్ రాష్ట్ర మిలటరీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. బెంగాల్ కి చెందిన ఇతడికి హైదరాబాద్ తో ఉన్న పరిచయం కారణంగా బాధ్యతలు అప్పజెప్పారు. అయితే భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత కూడా...నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు కొన్ని బాధ్యతలను కొనసాగించారు. 1948 సెప్టెంబర్ 18 నుంచి మిలటరీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై 'రాజముద్ర' వేసే అధికారం ఉన్న రాజ్యాధినేతగా నిజాం రాజు పదవిని నిర్వహించారు. 


కేటగిరీలుగా రాష్ట్రాలు 


1950 జనవరి 26న భారత రాజ్యాంగంలో రాష్ట్రాలను ఎ,డి,సి,డి కేటగిరిలుగా చేశారు. భారతదేశంలో విలీనమైన సంస్థానాలను 'బి' కేటగిరి రాష్ట్రాలుగా ఉంచారు. అప్పటికి ప్రజాస్వామిక పద్ధతి ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మెుదలు కాలేదు. అలా జెఎన్ చౌదరి 1949 డిసెంబర్ 1 వరకు మిలటరీ గవర్నర్ పదవిలో కొనసాగాడు. 1950 జనవరి 26 నుంచి సీనియర్ సివిల్ సర్వీస్ అధికారి ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రిగా పౌరపాలన ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఐక్యరాజ్యసమితిలో నిజాం దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్  ప్రభుత్వ గెజిట్లపై రాజముద్ర వేసే రాజుగానే కేంద్రం కొనసాగనిచ్చింది. హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియమితు లయ్యారు. రాజ్ ప్రముఖ్ పదవి ప్రస్తుత గవర్నర్ తో సమానం. 


రాజ్‌ప్రముఖ్‌గానూ బాధ్యతలు..


1950 జనవరి 26న హైదరాబాద్ లో భారత ప్రజాస్వామ్య రిపబ్లిక్ ఏర్పాటు ఉత్సవంలో భారత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని ప్రకటనను నిజాం చదివి వినిపించాడు. ఆ తర్వాత వెల్లోడి మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించాడు. 1956 వరకూ నిజాం రాజు హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ గా అధికారాలను చలాయించాడు. నిజాం రాజుకు సంవత్సరానికి 1.25 కోట్లు రాజ భరణంగా జీవితాంతం చెల్లించేందుకు భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఆపరేషన్ పోలోతో నిజాం రాజు ఆర్మీ, రజాకార్లు లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే రజాకార్లు లొంగిపోయే సమయంలో తమ ఆయుధాలను కమ్యూని స్టులకు అప్పజెప్పారు. అయితే ఈసమయంలో కమ్యూనిస్టులు ఉండకూడదనే లక్ష్యంతో జెఎన్ చౌదరి మిలటరీ ప్రభుత్వం దాడులు చేసింది. దాదాపు 4000 మందిని కమ్యూనిస్టులను చంపారని అంచనా.


Also Read: Hyderabad Liberation Day: ఏకకాలంలో బ్రిటీషర్లు, నిజాంలపై పోరాడిన హైదరాబాద్, యుద్ధం మొదలైంది ఇక్కడే!