Kodali Nani: ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజి తనను వేధిస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన వార్డు వాలంటీర్ మేరుగు లలిత ఆరోపించారు. కులం పేరుతో విపరీతంగా దూషిస్తున్నారని ఆవేన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. మేం గుడివాడ బాపూజీనగర్ 13వ వార్డులో నివసిస్తున్నామని తెలిపారు. తిరుపతమ్మకు చెరువు గట్టున మున్సిపాలిటీ స్థలంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నామని వివరించారు. అయితే మూడు రోజుల క్రితం బోరు వేసేందుకు కూలీలు పని చేస్తుండగా... రోడ్డు అవతలివైపు ఉన్న రమేష్, సురేష్ వచ్చి తమ సామాన్లు చెల్లా చెదురుగా పడేశారని తెలిపారు.  తనపై కూడా దాడి చేశారని, వాళ్లకు భయపడి అక్కడి నుంచి పారిపోయానని వివరించారు. తర్వాత వారిద్దరితో పాటు సురేష్ మామ సుబ్రహ్మణ్యం కూడా వచ్చారని చెప్పారు. ఈ ముగ్గురూ కలసి కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించారన్నారు. 


సీఐ కూడా వాళ్లకే వత్తాసు పలికాడు.. 
చుట్టు పక్కల వాళ్లు రావడంతో ముగ్గురూ పారిపోయారని.. డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి వివరాలు తీసుకున్నారని వెల్లడించారు. సాయంత్రం సీఐ దుర్గారావు పిలిపించగా.. వెళ్లి తనకు జరిగినదంతా ఆయనకు చెప్పినట్లు మేరుగు లలిత స్పష్టం చేశారు. వెంటనే బోరు పనులు ఆపేయాలని, లేకపోతే తిరిగి తనపైనే కేసు పెట్టాల్సి వస్తుందని సీఐ దుర్గారావు బెదిరించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజి దగ్గరకు వెళ్లగా.. తనతో అసభ్యంగా మాట్లాడారని, లక్ష్మోజి బంధువులు అయిన రమేష్, సురేష్ లకు అండగా నిలిచిరాని ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మేరుగు లలిత ఆవేదన వ్యక్తం చేశారు. 


వైసీపీ నేతల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య.. 
విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదాపక పంచాయతీ గోవిందపురం గ్రామానికి చెందిన సారిపల్లి సోమేశ్వరరావు ఈనెల 8వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం రోజు ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. రంగంలోకి దిగారు. మృదేహానికి నివాళులు అర్పించడానికి మృతుడి గ్రామానికి పయనమయ్యారు. ఆయనతో పాటు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడల్ పీలా శ్రీనివాస రావు, టీడీపీ నాయకులు ఉన్నారు. అయితే అప్పటికే గోవిందపురంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. టీడీపీ నేతలు, పక్క గ్రామాల ప్రజలు వస్తున్న విషయం తెలుసుకుని వెళ్లి మార్గ మధ్యంలోనే వారిని అడ్డుకున్నారు. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని లేకుంటే అరెస్టులు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినా టీడీపీ నాయకులు వినకుండా రోడ్డుపై బైఠాయించారు.


భూవివాదంలో సోమేశ్వర రావును వేధించారు !  


పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైకాపా నాయకుల ప్రోద్భలంతో పోలీసులు, రెవిన్యూ అధికారులు ఓ భూవివాదంలో సోమేశ్వర రావును వేధించారని.. అది భరించలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని బండారు సత్య నారాయణ ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. నేతలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, స్థానిక ప్రజలకు మధ్య తోపులాట జరిగింది. అయితే సోమేశ్వర రావు చావుకు కారణం అయిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి బండారు సత్యనారయణ ఆరోపించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఏసీపీ మోహన్ రావుకు ఫిర్యాదు కాపీని అందజేశారు.