KCR Andhra Tour : తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఆయన వెళ్లేది సీఎం జగన్‌తో సమావేశాకో..లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికో కాదు ... సీపీఐ మహాసభల కోసం ఓ పార్టీ అధినేత మరో పార్టీ మహాసభలకు హాజరవడం అరుదైన విషయం. ఆయినా కేసీఆర్ వెళ్లాలనుకుంటున్నారు.  అక్టోబర్ 14 నుంచి 18 విజయవాడలో  సీపీఐ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభల్లో పాల్గొనాలని బీజేపీయేతర ముఖ్యమంత్రులకు సీపీఐ ఆహ్వానం వెళ్లింది. తెలంగాణ, కేరళ,  బీహార్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపింది. సీపీఐ జాతీయ నేతలు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రులు ఆహ్వానిస్తున్నారు. 


సీపీఐ జాతీయ మహాసభలకు బీజేపీయేతర సీఎంలను ఆహ్వానిస్తున్న  నేతలు


అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగనుండగా... అక్టోబర్ 16న బీజేపీయేతర సీఎంలు హాజరుకావాలని సీపీఐ కోరుతోంది. అదే రోజు బీజేపీయేతర సీఎంల భేటీ నిర్వహించి జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చించాలని సీపీఐ నేతలు భావిస్తున్నారు.  పలువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే వస్తామని హామీ ఇవ్వగా... మిగిలిన సీఎంల రాకపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని సీపీఐ నేతలు చెబుతున్నారు. ఇటీవల మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా సీపీఐ ప్రకటించింది. ఆ సమయంలో జాతీయ స్థాయిలోనూ కలిసి పని చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందుకే కేసీఆర్ తప్పని సరిగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 


సీపీఐతో జాతీయ స్థాయిలో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న కేసీఆర్ 


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో రెండు సార్లు విజయవాడలో పర్యటించారు. చివరిసరిగా  కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఆహ్వానించేందుకు స్వయంగా విజయవాడ వచ్చారు. ఈ సారి మాత్రం  భిన్నమైన కారణంతో ఏపీకి వస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ కమ్యూనిస్టులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన విజయవాడ పర్యటనకు వస్తూండటం ఆసక్తి రేపుతోంది. 


కాల్ ది మార్షల్స్ అండ్ పుల్ దెమ్ అవుట్ - ఏపీ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయిన స్పీకర్ ! ఎందుకంటే ?


విజయవాడ పర్యటనలో సీఎం జగన్‌తో సమావేశం అవుతారా ?


విజయవాడ పర్యటనలో కేసీఆర్ ..  ఏపీ సీఎం జగన్‌తో సమావేశం అయ్యే చాన్స్ ఉందా లేదా అన్నది అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయమయ్యే అవకాశం ఉంది. ఏపీలో కమ్యూనిస్టులు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అందుకే ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చి.. జగన్‌తో సమావేశం అవడం బాగుండదని చెబుతున్నారు. అదే సమయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి చర్చల ఎజెండా ఏదైనా పెట్టుకోవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది.  మొత్తానికి ఏపీలో కేసీఆర్ పర్యటన రాజకీయంగానూ ఆసక్తి కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. 


రోజా మాటలను వక్రీకరించారు - ఆమెకు దళితులంటే ఎంతో గౌరవమన్న మంత్రి నాగార్జున !