TS Politics :   తెలంగాణ రాజకీయ పార్టీలు.. ప్రజల సెంటిమెంట్స్‌తో ఆట  ఆడుకుంటున్నాయి. ప్రజాసమస్యల కంటే...  ప్రజల సెంటిమెంట్స్‌ను గుర్తించి వాటితో రాజకీయాలు చేయడం ద్వారానే ఓట్ల వేట సాగించాలని అనుకుంటున్నాయి.  తెలంగాణ విమోచనా దినోత్సవాలయినా..  భవనాలకు అంబేద్కర్ పేర్లయినా.. అదే రాజకీయం. తెలంగాణ సెంటిమెంట్‌తో విజయాలు సాధిస్తూ వస్తున్న టీఆర్ఎస్‌కు.. బీజేపీ ఇలాంటి సెంటిమెంట్ రాజకీయాల సవాళ్లు విసురుతుంది. ఈ రాజకీయంలో ప్రజలూ భాగస్వాములవుతున్నారా ? తమ సమస్యల గురించే ఆలోచిస్తున్నారా ?


కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి బీజేపీకి కేసీఆర్ కొత్త సవాల్ ! 


ఢిల్లీలో కేంద్రం నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో పలు పార్టీలతో పాటు గద్దర్ వంటి ప్రముఖులు కూడా అన్ని పార్టీల నేతలను కలిసి పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. ఇదే డిమాండ్‌తో తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఆ వెంటనే కేసీఆర్..  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని  నిర్ణయించారు. ఇలా అంబేద్కర్ పేరు పెట్టడం  తెలంగాణ ప్రజలకు గర్వకారణమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  అంతే కాదు ఢిల్లీలోని సెంట్రల్ విస్టాకు కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని  అంబేద్కర్ పేరును పెట్టాలని  కేంద్రానికి లేఖ రాస్తానని ప్రకటించారు. ఇప్పుడు బీజేపీపై మరింత ఒత్తిడి పెరగనుంది. రాజ్యాంగ నిర్మాతను బీజేపీ గౌరవించాలంటే  సెంట్రల్ విస్టాకు అంబేద్కర్ పేరు పెట్టాల్సిందేనని.. లేకపోతే అవమానించినట్లేనన్న వాదన టీఆర్ఎస్ వర్గాలు చేయడానికి అవకాశం ఉంది. 


విమోచనా దినోత్సవం పేరుతో ఇప్పటికే రెండు పార్టీల రాజకీయాలు !


ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తుంది. తెలంగాణలోనూ వస్తుంది. ప్రతీ ఏడాది విమోచనా దినోత్సవం అధికారంగా చేయాలని ఒకరు… చేయకపోతే ఏమవుతుందని మరొకరు.. చేయకపోతే చేస్తామంటూ మరొకరుల హడావుడి చేస్తూంటారు. కానీ అన్ని పార్టీలు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ సారి మాత్రం సీన్ మారిపోయింది. అన్ని పార్టీలు పోటాపోటీగా చేస్తున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని మొదట కేంద్రం నిర్ణయించింది. అప్పటి వరకూ వివిధ కారణాలతో వద్దనుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. వెంటనే ఘనంగా మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకుంది. కేంద్రం తరపున నిర్వహించనున్న ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొంటున్నారు. రాష్ట్రం తరపున నిర్వహించబోయే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనడం సహజమే.  టీఆర్ఎస్ గతంలో డిమాండ్ చేసినా సైలెంట్‌గా ఉంది. బీజేపీ నిర్వహించాలని డిమాండ్ చేసింది కానీ.. కేంద్రం తరపున నిర్వహించాలనే ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. రెండు పార్టీలు పోటాపోటీగా ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌తో చాంపియన్లుగా నిలవాలనుకుంటున్నాయి.


ప్రజలూ ఈ సెంటిమెంట్లనే చూస్తున్నారా ? సమస్యలనా ?


ఇప్పటికైతే ప్రజా సమస్యల కంటే బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు భావోద్వేగాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంబేద్కర్ పేరు తో దళిత వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ అలా పేరు పెట్టడం లేదని వారికి నూరి పోస్తోంది. అదే సమయంలో బీజేపీ విమోచనా దినోత్సవంతో.. తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు స్కెచ్ వేసింది. టీార్ఎస్ కూడా అదే పని చేస్తోంది. అయితే ఈ మధ్యలో ప్రజా సమస్యలు మాత్రం చర్చకు రావడం లేదు. తెలంగాణలో బోలెడన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు వాటిపై మాత్రం పోరాడటం లేదు. కనీసం ఆలోచన చేయడం లేదు. మరి ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారా లేదా అన్నది ముందు ముందు తేలనుంది.