బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయని.. వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో తేలికపాటి జల్లులు కురవనున్నట్టు తెలిపింది.
ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వివిధ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని.. హైదారాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. చురుగ్గా రుతుపవనాలు కదులుతున్నాయని తెలిపింది. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. చెరువులు నిండు కుండలను తలపిస్తుండగా, వాగులు వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు బెంబేలెత్తించాయి. వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు మరణించారు.