తెలుగు రాష్ట్రాల్లో రాగల రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని  హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. రేపు (సెప్టెంబరు 19) బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని వెల్లడించారు. అదే జరిగితే 19, 20 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని, ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి.


అమరావతి వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయువ్య మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. 19 నాటికి అది అల్ప పీడనంగా మారుతుంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాగల మూడు రోజులు వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.






ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అయితే, ఈ వర్షాల తీవ్రత నేడు తెలిసే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రంలోని సీనియర్ అధికారి డాక్టర్ కరుణసాగర్ తెలిపారు.


స్కైమెట్ అనే వాతావరణ వెబ్ సైట్ రిపోర్టు ప్రకారం, దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువ వాన కురిసే అవకాశం లేదు. ఇంటీరియర్ కర్ణాటక, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, కేరళలో రానున్న రోజుల్లో అతి తక్కువగా వర్షాలు కురుస్తాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కొంత పెరుగుతాయి. రాబోయే కొద్ది రోజుల్లో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని నివేదిక పేర్కొంది.


తెలంగాణలో వర్షాలు ఇలా (Telangana Weather)
నేడు (సెప్టెంబరు 18) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. సెప్టెంబరు 19న కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


20న భారీ వర్షాలు
భారీ వర్షాలు తెలంగాణలోని మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా్ల్లో అక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ తేదీన పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. ఈ వర్షాలు 21న కూడా కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.