Munugodu Bypoll : మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ . ఎప్పుడూ చేయని తెలంగాణ విమోచన , విలీన, సమైక్యతా దినోత్సవాలను పార్టీలు పోటాపోటీగా నిర్వహించినా.. సీఎంలు కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెట్టినా..కేంద్రమంత్రులు దిగి వచ్చి కొత్త సెంటిమెంట్ ఒలకబోసినా అందరి లక్ష్యం.. వచ్చే ఏడాది చివరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలో.. ఆ తర్వాత ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికలో కాదు. మునుగోడు ఉపఎన్నికే అందరి టార్గెట్. అయితే అసలు మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు అనేది రాజకీయవర్గాలకు అంతు చిక్కడం లేదు. చివరికి బీజేపీ నేతలకూ ఈ అంశంపై స్పష్టత లేకుండా పోయింది.
మునుగోడు ఉపఎన్నికపై ఈసీ కసరత్తు చేసిందా !?
సాధారణంగా ఎన్నికల కమిషన్ ఒక స్థానం ఖాళీ అయితే ఆర్నెళ్లలోపు ఎన్నికలు నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా ఏమైనా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే వాటితోపాటు కలిపి ఎన్నికలు నిర్వహిస్తుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లో జరగాలి. ఈసీ అనుకుంటే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే మునుగోడు ఉపఎన్నికలు కూడా జరుగుతాయి. అయితే అది మరీ ఆలస్యం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన రోజు నుంచి ఆర్నెళ్లు అనుకున్నా జనవరి లోపు ఎన్నికలు జరగాలి. దాదాపుగా ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు మునుగోడు ఎన్నికలు జరుగుతాయి. కానీ ఈ లోపు ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు ఉపఎన్నిక నిర్వహించడానికీ అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ కారణంగా వచ్చే నెల అంటే అక్టోబర్ చివరిలో షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు పార్టీ నేతలకు సూచనలిచ్చారని చెబుతున్నారు. కానీ ఆయన కూడా ఉపఎన్నిక ఎప్పుడు ఉంటుందని చెప్పలేదు. అయితే ఈసీ వైపు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు అంతర్గతంగా జరుగుతున్నాయని చెబుతున్నారు.
ఉపఎన్నిక ఎప్పుడు నిర్వహించాలన్నది బీజేపీ చాయిస్ !
వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల కమిషన్ నిర్ణయం. అందులో కేంద్రానికి కానీ ఇతర పార్టీలకు కానీ చాయిస్ ఉండదు. అయితే అనధికారికంగా ఈసీపై కేంద్రంపై పట్టు ఉంది. బీజేపీ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ ఉంది. అందుకే బీజేపీ ఎప్పుడు ఉపఎన్నిక కావాలని అనుకుంటే అప్పుడు ఈసీ షెడ్యూల్ ఖరారు చేస్తుంది. అందులో సందేహం లేదు. అయితే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే ఉపఎన్నిక నిర్వహించాలని బీజేపీ అనుకోవడం లేదు. అక్కడ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు మదింపు చేసుకుంటోంది. ఆషామాషీగా లాటరీ వేసి గెలిస్తే గెలిచాం లేకపోతే లేదు అనుకునే రాజకీయం బీజేపీ అగ్రనేతలు ఎప్పుడూ చేయరు. దిగారంటే గెలవాలి. అందుకే మునుగోడు ఉపఎన్నికలోకి దిగారు. అక్కడ పరిస్థితిని పూర్తిగా అనుకూలంగా మల్చుకున్న తర్వాత ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేయడానికి గ్రీన్ ఇచ్చే చాన్స్ ఉంది. ఈ లోపు పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలో .. స్పష్టమైన ఆదేశాలు వస్తూ ఉంటాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇతర నేతలు పాటిస్తూ ఉంటారు.
పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఐదు రాష్ట్రాలతో పాటే !
బీజేపీకి పరిస్థితి అనుకూలంగా ఉందని అనిపిస్తే వచ్చే నెలాఖరులోనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. వేగంగా ఉపఎన్నిక పూర్తి చేస్తారు. అనుకూలంగా లేదని అనుకుంటే మాత్రం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు నిర్వహించవ్చచు. అయితే బీజేపీ గుడ్డిగా రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయిచిందని ఎవరూ అనుకోరు. పరిస్థితి అనుకూలంగా ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతనే రంగంలోకి దిగి ఉంటారు కాబట్టి ఉపఎన్నికలు కూడా వీలైనంత వేగంగా వచ్చే అవకాశం ఉంది.
ముఖాముఖి పోరు కోసమే కసరత్తు !
దుబ్బాకలో.. హుజూరాబాద్‌లో ముఖాముఖి పోరు జరిగితేనే బీజేపీకి లాభించింది. రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ.. అభ్యర్థుల్ని ఆలస్యంగా.. ఖరారు చేయడం.. బలహీన అభ్యర్థుల్ని ఎంపిక చేయడం..పార్టీ నేతల్లో అనైక్యత వంటి కారణాల వల్ల ఆ పార్టీ పరాజయం పాలైంది. ఆ పరాజయం అలాంటిలాంటిది కాదు. అసలు రేసులో లేనట్లుగా తేలింది. ఇప్పుడు బీజేపీ కూడా అలాంటి వాతావరణాన్నే కోరుకుంటోంది. మునుగోడులో కాంగ్రెస్ పోరాడుతోంది. బలమన క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఊపు తగ్గుతుందో అప్పుడు బీజేపీ సడెన్‌గా ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు సాగితే.. ఫలితం తేడా వచ్చినా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టినట్లవుతుంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్న పోరు ఖాయమవుతుంది. ఈ సిట్యూయేషన్ కోసమే బీజేపీ ఎదురు చూస్తోందని అనుకోవచ్చు.