Weather Latest News: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రాంతం ఈశాన్య దిక్కులో కదిలి ఈరోజు ఉదయానికి మధ్య బంగాళాఖాతం ప్రాంతం లో వాయుగుండం గా బలపడినది. ఈ వాయుగుండం అదే  ప్రాంతంలో బంగ్లాదేశ్ లోని ఖేర్పురకు  దక్షిణ నైరుతి దిశలో 750 కి.మీ దూరంలో కేంద్రీ కృతమై ఉన్నది. ఈ వాయుగుండం ఈశాన్య దిక్కులోనే కదులుతూ మరింత బలపడి ఈనెల 25 వ తేదీ ఉదయానికి తూర్పు మద్య బంగాళాఖాతం ప్రాంతంలో తుఫాన్ గా మారి పిమ్మట ఇంచుమించు ఉత్తర దిక్కులో కదులుతూ మరింత  బలపడి తీవ్ర తుఫాన్ గా మారి ఈ నెల 26 వ తారీఖు అర్ధ రాత్రి సమయానికి నాటికి బంగ్లాదేశ్, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో సాగర్ ఐలాండ్ ఖేర్పుర మధ్య తీరాన్ని దాటే అవకాసం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతం, ఉత్తర మధ్య బంగాళాఖతంలోని కొన్ని ప్రాంతాలలోకి ఈరోజు విస్తరించాయి. రాష్ట్రంలో కింద స్థాయి గాలులు ప్రధానంగా పడమర / వాయువ్య దిశల నుండి వీస్తున్నాయి. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు, మూడు డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయి.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):


ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఎల్లుండి రాష్ట్రం లో పొడి వాతావరణం ఏర్పదే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు  (weather warnings)
ఈరోజు, రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ. వేగంతో  వీచే ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.


ఇక్కడ ఎల్లో అలర్ట్
మే 25న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ.) కూడిన వర్షాలు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.9 డిగ్రీలుగా నమోదైంది. 60 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: మే 24 నాటికి నైరుతి రుతుపవనాలు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు, కొమొరిన్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రం, అండమాన్, నికోబార్ దీవుల్లోని మిగిలిన భాగాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 


ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.