SRH vs RR IPL 2024 Qualifier 2: ఐపిఎల్(IPL2024) తుది సమరానికి సన్‌రైజర్స్‌హైదరాబాద్(SRH) దూసుకెళ్లింది. అన్నీ విభాగాల్లో పటిష్టంగా రాణించిన సన్‌రైజర్స్ రాజస్థాన్ రాయల్స్(RR) ను చిత్తు చేసింది. మొదట హెన్రిచ్ క్లాసెన్ , రాహుల్ త్రిపాఠి , ట్రావీస్ హెడ్ బ్యాట్ తో రాణించగా తరువాత హైదరాబాద్ బౌలర్లు చెలరేగిపోయారు. రాజస్థాన్ బ్యాటర్ లు ఎవ్వరినీ క్రీజులో కుదురుకోనివ్వలేదు. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లులో 9 వికెట్స్ కోల్పోయి 175 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే ఆటను ముగించేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ మూడు , అభిషేక్ శర్మ రెండు , కమిన్స్, నటరాజన్ చెరో వికెట్ తీశారు. క్వాలిఫయర్ 1 ఓటమి నుంచి వెనువెంటనే బయటపడిన సన్‌రైజర్స్ చెపాక్ లో చక్రం తిప్పింది. ఫైనల్స్ లోకి దూసుకుపోయింది. రాజస్థాన్ రాయల్స్‌కు తన సత్తా చూపించింది.
ఫలించని ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం
హైదరాబాద్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన రాజస్థాన్ పవర్ ప్లే లోపే తొలి వికెట్ కోల్పోయింది . 21 బంతులకు, 42 పరుగులు చేసి జైస్వాల్ అవుట్ అవ్వగా 10 పరుగులకే శాంసన్ పెవిలియన్ చేరాడు. షాబాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఒకే ఓవర్ లో రియాన్ పరాగ్, అశ్విన్ లను అవుట్ చేశాడు. షాబాజ్ అహ్మద్ 3 , అభిషేక్ శర్మ 2 వికెట్లు తియ్యటంతో టాప్ బ్యాటర్ లు పెవిలియన్ చేరారు. ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 55 పరుగులు చేసి జట్టు పరువైతే నిలిపాడు గానీ గెలిపించలేకపోయాడు.
హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ సాగిందిలా..
క్వాలిఫయర్ 2 లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌లో కోల్‌కతాతో టైటిల్ కోసం తలపడనున్న నేపధ్యంలో ఉత్కంఠ భరిత మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన అభిషేక్ శర్మ 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లో 37 పరుగులు చేసి చాహల్‌కు క్యాచ్ ఇచ్చాడు. తరువాత మక్రమ్ కూడా వెంటనే అవుట్ అవ్వడగా పవర్ ప్లే ముగిసే సమయానికి సన్‌రైజర్స్ స్కోరు 68/3. 10 వ ఓవర్ లో హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 34 పరుగులకే ఔటయ్యాడు. ట్రావిస్ హెడ్ ఔటైన తర్వాత హైదరాబాద్ స్కోరు మందగించింది. నితీశ్ రెడ్డి 5 పరుగులకే పెవిలియన్ చేరగా, అబ్దుల్ సమద్ డకౌటయ్యాడు. ప్రధాన ఆటగాళ్లంతా అటూ ఇటుగా ఆడి చేతులెత్తేసిన వేళ ట్రావీస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షాబాజ్ అహ్మద్ 18 రన్స్ చేశాడు. 34 బంతుల్లో 4 సిక్స్‌లతో హెన్రిచ్ క్లాసెన్ అర్ధ శతకంతో రాణించాడు. అయితే చివరిలో సందీప్ శర్మ క్లాసెన్ ను అవుట్ చేసి రెండవ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, అవేశ్ ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు.