వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. షర్మిల పాదయాత్రకు కూడా అనుమతిని రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహబూబాబాద్‌ సమీపంలో బేతోలులో దగ్గర షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఆమె ఉండే కారవాన్ లోకి వెళ్లి షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. షర్మిలను హైదరాబాద్ తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


నిన్న (ఫిబ్రవరి 18) మహబూబాబాద్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.


కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమితరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ‘శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా’ అంటూ సవాలు విసిరారు. ఆ తాటాకు చప్పుళ్లకు ఈ వైఎస్సార్ బిడ్డ భయపడబోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


‘‘ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమను బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నాడు. పాదయాత్రను అడ్డుకునేలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నాడు. ప్రజల పక్షాన నిలబడి, కొట్లాడుతున్నందుకు మీకు భయపడాలా? మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్నందుకు భయపడాలా? నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. శంకర్ నాయక్ ఒక కబ్జా కోరు, జనాల దగ్గర భూములు గుంజుకోడమే ఆయనకు తెలుసు’’ అంటూ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.


ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే భార్య


తన భర్తపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య సీతామహాలక్ష్మీ ఆందోళనకు దిగారు. షర్మిల బస చేసిన క్యాంపు ముందు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మహబూబాబాద్‭లో షర్మిల పాదయాత్ర చేయడానికి వీల్లేదంటూ ఆందోళన చేశారు. వైఎస్ఆర్టీపీకి చెందిన ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. షర్మిల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. శంకర్ నాయక్‭కు క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు వెంటనే ఆందోళన విరమించాలని పోలీసులు సూచించారు.


అంతకుముందు..  నెళ్లికుదురు మండల కేంద్రంలో వైఎస్ షర్మిల శంకర్‌నాయక్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో  చూస్తా.. అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేస్తున్న మోసాలను ఎత్తి చూపిస్తుంటే భయంగా ఉందా అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.