Mulugu Govt Hospital : ములుగు జిల్లా పెద్దాస్పత్రిలో పేదల ప్రాణాలంటే పట్టింపులేకుండా పోతోంది. వరుస ఘటనలతో బాలింతలు ఆస్పత్రికి రావడానికి భయపడుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి తోడు ఆపదలో వస్తే సిబ్బంది పనితీరు, మర్యాదలేని మాటతీరుతో పెద్దాస్పత్రి పేదల కోసం కాదా అంటూ ఆవేదన చెందుతున్నారు. ఆధునిక సాంకేతిక పెరిగినా వైద్యులు, వైద్యాధికారుల తీరుతో సమాజం ముక్కునవేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల భూపాలపల్లి జిల్లాకు చెందిన నిండు గర్భిణీ మృతి చెందగా నిన్న తాడ్వాయి మండలం బయ్యక్కపేట అటవీ ప్రాంతంలోని గొత్తికోయ గూడానికి చెందిన మహిళ ప్రసవించగా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు.
7 కిలోమీటర్లు అడవిలో ఆపసోపాలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట శివారులోని నీలంతోగు గుంపునకు చెందిన గొత్తికోయ బాలింత మడకం జ్యోతి ప్రాణాపాయ స్థితిలో కోమాలోకి వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గర్భిణీకు ఆపరేషన్ చేసి కుట్లు విప్పకుండానే ఇంటికి పంపించారు వైద్యులు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాలింతను గుట్టుచప్పడు కాకుండా వరంగల్ ఎం.జి.ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మడకం జ్యోతి ఈనెల 11న ప్రసవం కోసం ములుగు ప్రాంతీయ ఆసుపత్రిలో చేరగా ఆ గర్భిణీకి వైద్యులు పెద్దాపరేషన్ చేశారు. మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు క్షేమంగా ఉండగా, తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఐదురోజుల తర్వాత జిల్లా ఆస్పత్రి వైద్యులు బాలింతను ప్రభుత్వ వాహనంలో బయ్యక్కపేట గ్రామానికి తీసుకెళ్లమని చెప్పగా బంధువులు తరలించారు. నీలంతోగు గూడెం వాసులు ఆ మహిళను 7 కిలోమీటర్లు అడవి దారిలో మోసుకొని తీసుకువెళ్లారు. అయితే శుక్రవారం జ్యోతికి సరైన వైద్య సేవలు అందకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ రమా సమ్మిరెడ్డి వైద్యులకు సమాచారం అందించారు.
కుట్లు విప్పకుండా ఇంటికి
కొడిశాల పీహెచ్ సీ సబ్ సెంటర్ కాల్వపల్లి వైద్యులు నీలంతోగు చేరుకొని జ్యోతికి ప్రథమ చికిత్స అందించారు. అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను బయ్యక్కపేటకు ట్రాక్టర్ లో తీసుకొచ్చారు. వాగులు అడ్డువచ్చిన చోట మహిళను టాక్టర్ నుంచి దింపి వాగు దాటుతూ ప్రయాణించి బయ్యక్కపేటకు చేర్చారు. అక్కడి నుంచి 108 సహాయంతో ములుగు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే జ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వరంగల్ ఎంజీఎం కు తరలించినట్లు తెలిసింది. ములుగు ప్రాంతీయ వైద్యశాలలో ప్రసుతి కోసం వచ్చిన గర్భిణీ జ్యోతికి ఆపరేషన్ అనంతరం కుట్లు విప్పకుండా, కేసీఆర్ కిట్ కూడా ఇవ్వకుండా హడావుడిగా ఇంటికి పంపించారని భర్త దేవయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళ ప్రాణాపాయస్థితిలో మహిళ ఉన్నట్లు సమాచారం తెలుసుకొని వెళ్లిన వైద్యులతో జ్యోతి భర్త దేవయ్య వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తుంది.
వెంటిలేటర్ లేదంటూ ఇతర ఆసుపత్రులకు రిఫర్
వారం రోజుల క్రితం మరో సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన గర్భిణీకి నొప్పులు రావడంతో ములుగులోని జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. 8 నెలల నిండు గర్భిణీ అయిన నగావత్ స్వాతికి శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు తలెత్తగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అందించకుండా హన్మకొండకు రిఫర్ చేశారు. ములుగు నుంచి హన్మకొండ వెళ్తుండగా మార్గమధ్యలో మహిళ మృతి చెందింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు సోషల్ మీడియాలో పలువురు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పేరుకే పెద్దాస్పత్రి అని, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తీరుతో పేదలు వైద్యం కోసం రావాలంటే జంకుతున్నారు. భూపాలపల్లి ఆస్పత్రిలో సరైన వైద్యం లేక ములుగుకు వస్తే ఇక్కడ కూడా అదే నిరాశ ఎదురవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల గడువులో గర్భిణీ మృతి చెందడం, మరో మహిళ తీవ్ర అనారోగ్యానికి గురై కోమా స్టేజీలోకి వెళ్లడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.