Police shows their big heart by built home to Old Women : వరంగల్ : కన్న కూతురి చేతిలో దగాపడింది ఆమె. బస్టాండ్‌లో ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలి పరిస్థితి అర్థం చేసుకుని పెద్ద మనసు చాటుకున్నారు ఖాకీలు. పౌరులను రక్షించడంలోనే కాదు వారి అభాగ్యులను ఆదుకోవడంలోనూ తమ వంతు పాత్ర పోషిస్తామని పోలీసులు చాటిచెప్పారు. నీడ లేని అవ్వకు ఇంటిని నిర్మించి అందించి తమ పెద్ద మనస్సును చాటుకున్నారు ఎల్కతుర్తి పోలీసులు. వివరాల్లోకి వెళితే ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన ఏడుపదుల వయసున్న గొర్రె మార్తా జీవితాంతం ఎంతో శ్రమించి కూడబెట్టిన ఆస్తులన్నీ తన వృద్ధాప్యంలో తోడు ఉంటుందనుకోని హనుమకొండలో నివాసం ఉంటున్న ఒక్కగానొక్క కూతురికి ధారాదత్తం చేసింది. 


తల్లిని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన కూతురు
ఆస్తులు చేజిక్కించుకున్న కుమార్తె తల్లిని చితకబాది తన ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. దీంతో చేసేదేమీలేక చివరకి ఆ వృద్ధురాలు గొర్రెమార్తా తన స్వగ్రామంలోని బస్టాండ్ షెడ్ ను ఆశ్రయించింది. ఈ విషయాన్ని మీడియా రిపోర్ట్ చేసింది. పలు పత్రికల్లో కథనాలు వెలుబడటంతో స్పందించిన ఎల్కతుర్తి పోలీసులు కాజీపేట్ ఏసిపి శ్రీనివాస్ పిలుపునందుకొని బస్టాండ్ షెడ్ లో ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలిని చేరదీసిన ఎల్కతుర్తి పోలీసులు ముందుగా వృద్ధురాలికి వైద్యం అందించడానికి చర్యలు తీసుకున్నారు. 

Warangal Police: కన్న కూతురు మోసం చేస్తే, ఖాకీలు కనికరం - అవ్వకు ఇల్లు కట్టించిన పోలీసులు


పెద్దావిడకు కట్టించి ఇచ్చిన ఇల్లు ఇదే


అవ్వకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న పోలీసులు
అదే గ్రామంలో తాత్కాలిక గృహంలో ఆశ్రయం కల్పించి నిత్యవసర వస్తువులతో పాటు కొంత డబ్బును అందజేశారు. దీనితో తమ బాధ్యత తీరిపోదని గుర్తించిన పోలీసులు దగాపడిన ఆ మాతృమూర్తికి ఇంటిని నిర్మించి ఇస్తామని ఏల్కతుర్తి పోలీసులు హామీ ఇచ్చారు. కేవలం హామీకే పరిమితం కాకుండా పోలీసులు దాత అందించిన స్థలంలో ఎల్కతుర్తి పోలీసులతో పాటు కాజీపేట డివిజన్ కు చెందిన పోలీసులు సహాయ సహకారాలు, స్థానిక గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహాకారంతో యుద్ధ ప్రాతిపదికన సకల సౌకర్యాలతో ఇంటి నిర్మాణం పూర్తి చేశారు.


అవ్వకు ఆర్థిక సాయం చేసిన దాతలు


ఇంటిని ప్రారంభించిన సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్


కూతురి చేతిలో మోసపోయిన ఆ వృద్ధురాలి కోసం ఎల్కతుర్తి పోలీసులు నిర్మించిన ఇంటిని బుధవారం సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ వృద్ధురాలు ముందుగా నూతనంగా నిర్మించిన ఇంటిలోకి గృహప్రవేశం చేసింది. తన నివాసం కోసం తన బిడ్డలాగా ముందు వచ్చి తనకు ఇంటిని నిర్మించి ఇచ్చిన పోలీసులకు మార్తా కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం డిసిపి చేతుల మీదుగా లక్షన్నర రూపాయల ఆర్థిక సాయాన్ని వృద్ధురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఎసిపి శ్రీనివాస్, ఎల్కతర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ధర్మసాగర్, ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎల్కతుర్తి, భీందేవరపల్లి, వంగర ఎస్.ఐలు పరమేశ్వర్, ప్రవీణ్ కుమార్, మౌనిక గ్రామ సర్పంచ్ రమాదేవి, ఎంపీటీసీ రమాతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.