Govt Hospital Delivery : జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో డాక్టర్లు మంగళవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో 35 డెలివరీలు చేశారు. గడిచిన 24 గంటల్లో 35 కాన్పులు చేయగా తల్లులు, పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఈ డెలివరీల్లో 14 నార్మల్ కాగా 21 కాన్పులు సిజేరియన్ ​చేసినట్లు చెప్పారు. ఈ కాన్పుల్లో 20 మంది మగపిల్లలు, 15 మంది ఆడపిల్లలు పుట్టారని వెల్లడించారు. 15 మంది మహిళలకు మొదటి కాన్పు జరిగిందని, వీరిలో 9 మందికి నార్మల్ డెలివరీలు, మిగతా ఆరుగురికి సిజేరియన్ అయిందని తెలిపారు. డెలివరీలు చేసిన డాక్టర్లు శోభ, రజిని, మనస్విని, సిస్టర్​లు మరియమ్మ, సంగీత, ఇతర స్టాఫ్ ను హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు, ఆర్ఎంఓ శంకర్ నాయక్ అభినందించారు. డాక్టర్ల పనితీరుపై గర్భిణీలు, వారి బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.


ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రసవాల సంఖ్య పెరగాలి-మంత్రి హరీశ్ రావు


తెలంగాణలోని సర్కారు దవాఖానాలను కార్పొరేట్‌స్థాయిలో సేవలు అందించే విధంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరగాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవం జరిగితే కేసీఆర్‌ కిట్‌తోపాటు రూ.13 వేలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్‌లో ఎక్కువ శాతం సీ సెక్షన్‌ జరుగుతున్నాయని, ప్రభుత్వ దవాఖానల్లో సీ సెక్షన్‌ చాలా తక్కువ ఉందన్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోతారని, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి ఏఎన్‌సీ, నాలుగో ఏఎన్‌సీ నమోదు శాతం చాలా తక్కువగా ఉందని, కేవలం 63 శాతం మాత్రమే నమోదవున్నాయి గర్భం దాల్చిన 12 వారాల్లోనే మొదటి ఏఎన్‌సీ నమోదు కావాలని.. అప్పుడు మాత్రమే గర్భిణీకి రక్తహీనత లేకుండా సమయానికి ప్రసవం జరుగుతుందన్నారు.  సకాలంలో ఏఎన్‌సీ నమోదు చేయకపోవడంతో గర్భిణీలు 80 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని, దీనిని తగ్గించేలా పనిచేయాలని వైద్యులను ఆదేశించారు. 


ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న ప్రసవాలు 


నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ న్యాయస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి షాలిని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.  సర్కారు దవాఖానాల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని అధికారులు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతుందనడానికి నిదర్శనం ఇదేనన్నారు. నార్మల్ డెలివరీలు చేయడానికి వైద్యులు కృషి చేయాలని వైద్యులను అధికారులు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిస్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఇటీవల  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు అదనపు కలెక్టర్ ఇలా ట్రిపాఠి, ఆమె భర్త కలెక్టర్ భవేష్ మిశ్రాకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రబుత్వాసుపత్రిలో కలెక్టర్ ప్రసవించడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్లే ప్రజల మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వాసుపత్రిని ఎంచుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయలు బాగుండడం వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు.