Warangal News: ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన అత్యద్భుత శిల్ప కళాఖండం అయిన "రామప్ప " కు సింగరేణి కంపెనీ ఓపెన్ కాస్టు మైనింగ్ ముప్పు పొంచిఉంది. ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుర్తింపు పొందినందుకు తెలంగాణ ప్రజలు, భారతీయులంతా ఎంతగానో సంతోషించారు. కానీ ఆ సంతోషాన్ని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ పోగొట్టనుంది. ఇప్పటికే సింగరేణి కంపెనీ తెలంగాణలో అడవులు, కొండలు, వాగులు, వంకలు, పంట పొలాలు, వందలాది పల్లెల ఆనవాళ్లు లేకుండా చేసి జనం, జంతు జాలం, పక్షి జాతిని ఆగం పట్టిచ్చి బొందల గడ్డలుగా మార్చిన చరిత్ర ఈ సింగరేణికి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 2010 సంవత్సరంలో కోస్టల్ కంపెనీ దేవాదుల సొరంగం తవ్వకాలు చేపట్టింది. ఈ క్రమంలో అప్పుడు పేల్చిన బాంబుల వల్ల రామప్ప ఆలయ గోడలు బీటలు వారిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
మళ్లీ ఇన్ని రోజులకు రామప్ప ఆలయానికి దగ్గర్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్
అయితే ఈ విషయాన్ని విషాధకర ఘటనగా నాడు అన్ని పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి. అయినప్పటికీ ఏఎస్ఐ మాత్రం అంతగా స్పందించలేదనే విమర్శ ఉంది. దీంతో కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల నేతలు రామప్ప పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆందోళనలు చేశారు. ఆ తర్వాత మరో ఏడాదికి రామప్ప ఆలయానికి 20 కిలో మీటర్ల దూరంలోనే ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టేందుకు సర్వేలు చేసింది. దీంతో ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగి దాన్ని ఆపేలా చేశారు. అలాగే ఎఏఎస్ఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదన పత్రాలు యునెస్కోసు వెళ్లడం గుర్తింపు రావడం అందరికీ విదితమే. మళ్లీ ఇన్ని రోజులకు సింగరేణి మరోసారి ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయబోతుందనే వార్తలు అందరిలో ఆందోళన రేపుతున్నాయి.
ఓపెన్ కాస్ట్ మైనింగ్ తో
వాస్తవంగా ఓపెన్ కాస్టు మైనింగ్ అనే అతి విధ్వంసకర ప్రక్రియ.. జనావాసం అసలే లేని నిర్జన ప్రదేశంగా ఉండే ఎడారిలో జరుపు కోవాలని ప్రపంచ వ్యాప్త పర్యావరణ నిబంధనలు ఉన్నాయి. కానీ వాటికి అనుగుణంగా ఆస్ట్రేలియా ఖండం ఒక్కటే తమ ఎడారిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కొనసాగిస్తోంది. అట్లాగే యునెస్కో గుర్తింపు పొందిన ప్రతి ఏ ఒక్క వారసత్వ సంపదకు ఎటు చూసినా యాభై కిలోమీటర్ల వరకు ఎలాంటి విధ్వంసకర పరిస్థితులు సృష్టించరాదనే నిబంధనలు కూడా ఉన్నాయి. కానీ వాటికి విరుద్ధంగా సింగరేణి కంపెనీ పది కిలో మీటర్ల దూరంలోనే ఓపెన్ కాస్టు మైనింగ్ ప్రక్రియ కొనసాగించడానికి సిద్ధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే దగ్గరి గ్రామాలు, పల్లెల్లో సింగరేణి అధికారులు సర్వేలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మన కళ్ల ముందు కళకళలాడిన శతాబ్ధాల అత్యద్భుత శిల్ప సంపద నేలమట్టంమయ్యే వినాశకరం దాపురిస్తుంది. కాబట్టి రామప్పకు సింగరేణి తలపెట్టబోతున్న పెను ముప్పును తొలగించాలని కోరుతోంది. ఆ రామప్పను ఒక శిల్ప కళా విశ్వవిద్యాలయంగా భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా తీర్చిదిద్దాలని పర్యావరణ పరిరక్షణ వేదిక సభ్యులు కోరుతున్నారు.