Warangal News: టాస్క్ ఫోర్స్ విభాగంలో పని చేస్తున్న ఓ సీఐ సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లను వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ సస్పెండ్ చేశారు. గత కొంత నెలలుగా కాలంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని టాస్క్ ఫోర్స్ విభాగంలో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న వి నరేష్ కుమార్ తో పాటు టాస్క్‌ఫోర్స్ విభాగంలోనే హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న శ్యాంసుందర్ సోమలింగం, కానిస్టేబుళ్లు సృజన్ లను సీపీ రంగనాథ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు టాస్క్ ఫోర్స్ విభాగంలో పని చేస్తూ.. కొంతమంది ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యం దందా చేస్తున్న వారితో కుమ్మక్కు అయినట్లు ఆయన తెలిపారు. ఇలా అక్రమాలకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు, కేసులు లేకుండా వదిలేసినట్లు ఆరోపణలు రావడంతో సీపీ రంగనాథ్ విచారణ చేయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే వారు తప్పు చేసినట్లు నిర్ధారణ కావడంతో.. వారిని సస్పెండ్ చేసినట్లు వివరించారు. నరేష్ కుమార్ గతంలో వరంగల్ జిల్లాలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించి కొద్దికాలం క్రితమే సీఐగా ప్రమోషన్ పొందారు. సీఐగా వరంగల్, హన్మకొండ పోలీస్ స్టేషన్లలో నిర్వహించి కొద్ది నెలల  క్రితమే టాస్క ఫోర్స్ లోకి బదిలీపై వచ్చాడు.


మహిళా పోలీసులను వేధించిన వారినీ సస్పెండ్


అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌, మహిళా సిబ్బంది ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తున్న పోలీస్ అధికారుల ప‌ట్ల వ‌రంగ‌ల్ సీపీ రంగ‌నాథ్ క‌ఠినంగా వ్య‌వ‌హరిస్తున్నారు. ఇటీవలే గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్ వెంకటేశ్వర్లు, దామెర ఎస్సై ఏ హరిప్రియ, సుబేదారి ఎస్సై పీ పున్నం చందర్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పటికే క‌మిష‌న‌రేట్ పరిధిలో విధులు నిర్వ‌హిస్తున్న ప‌లువురు ఎస్సైలు, సీఐల‌పై అనేక అవినీతి, వివాహేత‌ర సంబంధాల ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌లువురు అధికారుల‌పై సీపీకి ఫిర్యాదులు సైతం అందుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల బాధ్య‌త‌లు చేప‌ట్టిన సీపీ రంగనాథ్‌..  వీటిపై సీరియ‌స్‌గా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న అధికారుల‌పై కొర‌ఢా ఝ‌లిపిస్తూ, ప్ర‌ధానంగా మ‌హిళా సిబ్బందికి భ‌రోసా క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా సీపీ రంగనాథ్ ముందుకు వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప‌రిస్థితిలో మార్పు వ‌స్తుంద‌న్న ఆశ‌తో మ‌హిళా పోలీసులు ఎదురు చూస్తున్నారు.


మహిళా పోలీసులు.. తస్మాత్ జాగ్రత!


కొత్త‌గా పోలీస్ ఉద్యోగంలోకి వ‌చ్చే మ‌హిళా ఎస్సైలు, కానిస్టేబుళ్ల ప‌ట్ల ప‌లువురు సీఐలు, ఎస్సైలు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించ‌డం.. అనుచితంగా మాట్లాడ‌టం ప‌రిపాటిగా మారింద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. విధులు ముగించుకుని వెళ్లిన‌ప్ప‌టికీ త‌రుచూ ఫోన్లు చేసి వంక‌రగా మాట్లాడుతూ వేధింపుల‌కు గురిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలోనూ మానుకోట జిల్లాలో ఓ ట్రైనీ మ‌హిళా ఎస్సైని విధుల పేరుతో అర్ధరాత్రి ఓ ఎస్సై త‌న వాహ‌నంలో తీసుకెళ్లి లైంగిక‌ దాడికి య‌త్నించిన‌ట్లు స్వ‌యంగా బాధితురాలు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. మ‌రో ప‌క్క త‌మ మాట విన‌ని మ‌హిళా సిబ్బందిపై కొంద‌రు అధికారులు క‌క్ష‌సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో మ‌హిళా సిబ్బంది తీవ్ర మాన‌సిక ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇంట్లో వారికి, బంధువుల‌కు, మిత్రుల‌కు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. అయితే పోలీస్‌శాఖ‌లో కూడా మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువవ‌డంతో ఎప్పుడేం జ‌రుగుతుందోన అని కుటుంబాలు ఆందోళ‌న చెందుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన సీపీ కఠిన చర్యలు తీసుకుంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.