Medical Student Saif Ban Continues In Preeti Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ప్రీతి మృతి కేసులో పిజీ సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ పై నిషేధం పొడగించారు కళాశాల అధికారులు. ప్రీతి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌పై కళాశాల అధికారులు ఏడాది పాటు నిషేధం విధించారు. హైకోర్టుకు వెళ్లిన సైఫ్‌కు ఊరట లభించింది. సస్పెన్షన్‌ను తాత్కాలికంగా ఎత్తివేసి తరగతులకు హాజరు అయ్యేందుకు అనుమతి లభించింది.
జూన్ వరకు నిషేధం
అక్టోబర్ నుంచి నిన్నటి వరకు సైఫ్ 97 రోజులు తరగతులకు హాజరయ్యారు. అయితే హైకోర్టు తరగతులకు అనుమతించి విచారణ చేయాలని చెప్పడంతో కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేసి ఆరోపణలు నిజమని తేల్చింది. అందుకే గతంలో విధించిన ఏడాది నిషేధాన్ని కొసాగిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ చెప్పారు. ప్రీతి ఆత్మహత్య తరువాత 365 విధించిన నిషేధాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అప్పడు తీసుకున్న నిర్ణయం ఆధారంగా సైఫ్‌పై విధించిన నిషేధ కాలం ఈ మార్చి మూడుతో ముగియనుంది. కానీ ఆయన కోర్టును ఆశ్రయించి గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు క్లాస్‌లకు హాజరవుతున్నారు. అందుకే నిషేధం గడువు జూన్‌కు పొడిగించినట్టు ప్రిన్సిపల్ వెల్లడించారు.
గతేడాది ఫిబ్రవరిలో ప్రీతి ఆత్మహత్య
ప్రీతి గతేడాది ఫిబ్రవరి 22న ఎంజీఎంలో ఆత్మహత్యయత్నం చేసుకుంది. నిమ్స్ లో చికిత్స పొందుతూ అదే నెల 26న మృతి చెందింది. ప్రీతి మృతికి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ప్రీతి పేరెంట్స్ పోలీసులకు కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ యాక్ట్‌తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సైఫ్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ర్యాగింగ్ కేసు ఉన్నందున సైఫ్ తరగతులకు హాజరు కాకుండా ఏడాది పాటు సస్పెండ్ చేసింది యాంటీ ర్యాగింగ్ కమిటీ.
కోర్టులో ఊరట
బెయిల్‌పై విడుదలైన సైఫ్ తన వివరణ తీసుకోకుండా కళాశాల నుంచి సస్పెండ్ చేశారని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సైఫ్ వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ చేసిన కళాశాల అధికారులు ఇదే నిషేధాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు జారిచేశారు.