Warangal News: హన్మకొండలోని నాలుగు డివిజన్లలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. రెడ్డి కాలనీ, యాదవ్ నగర్, కృష్ణ కాలనీ, గౌతమ్ నగర్ లలో రెచ్చిపోయాయి. ఒక్కరోజే.. కనిపించిన వారిని కనిపించినట్టు కరిచి అందరినీ గాయపరిచాయి. నిమిషాల వ్యవధిలోనే సుమారు 15 మందిపై దాడి చేయగా.. నాలుగో డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ స్పందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ ను పిలిపించి పిచ్చి కుక్కలను పట్టుకొని బంధించారు. మొత్తంగా ఒకే రోజు  నాలుగు కాలనీల నుంచి 32 మంది ఎంజీఎంకు బాధితులు తరలివచ్చారు. 


అయినా చలనం లేదా..?


ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలంలో జరిగిన ఘటన ప్రజలను మరింత భయానికి గురిచేసింది. బుధవారం రాత్రి హసన్ పర్తి మండలం కోమటిపల్లిలో అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. నమ్మిండ్ల అవిక (4) నుదురు, కంటి భాగాలను కరిచాయి. కుక్కల దాడిలో చిన్నారికి తీవ్రంగా రక్తం కారి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతోంది.


పట్టింపులేని అధికారులు..


కుక్కల బెడద విషయమై ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. కుక్కలను నివారించాలని, జీవాలకు టీకాలు వంటివి వేయించి తమకు భయాందోళనలు లేకుండా చేయాలని వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పైగా ఎక్కడెక్కడో పట్టుకున్న కుక్కలను జనావాసాల్లో వదలడం, కుక్కలు ఉన్నాయని సమాచారం ఇచ్చినా అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నియంత్రణలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న సంబంధిత శాఖాధికారులపై కఠినంగా వ్యవహరిస్తేనే సమస్యకు పరిష్కారం వస్తుందని పలువురు బాధితులు ఎంజీఎం ఆవరణలో అసహనం ప్రదర్శించడం కనిపించింది.


వేసవిలో కుక్కలు ఎక్కువగా కరుస్తాయట!


మనుషుల మాదిరిగానే వేడి వాతావరణంలో కుక్కల స్వభావం కూడా మారుతుంది. ఎండలోనుంచి వచ్చిన వ్యక్తి చాలా చికాకుగా ఉంటాడు. ఎవరైనా ఏమైనా అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. కుక్కల మానసిక పరిస్థితి కూడా వేసవిలో అలాగే ఉంటుంది. అవి చాలా దూకుడుగా, కోపంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా వాటికి ఆహారం, నీళ్లు అందుబాటులో ఉండవు. దీని వల్ల అది డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఇలా డీ హైడ్రేషన్‌కు గురైన కుక్క ఎవరినైనా కరిచే అవకాశం ఎక్కువ.  అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ చెప్పిన ప్రకారం కేవలం వీధి కుక్కలు మాత్రమే కాదు, వేసవిలో పెంపుడు కుక్కలు సైతం ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాకపోతే వీధి కుక్కలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది. కుక్క కరిచేటప్పుడు 34 శాతం తల, మెడ, బుగ్గలపూ దాడి చేస్తాయి. 21 శాతం పెదవులపై, 8 శాతం ముక్కు, చెవులపై కరుస్తాయి. కొన్ని సార్లు పాదాలు, చీలమండలపై కూడా కరుస్తాయి. 


ఆడకుక్కలు ఆ సమయంలో...


ఆడ శునకాల్లో లైంగిక హార్మోన్లు విడుదలవుతున్న సమయంలో కూడా అది దూకుడుగా ప్రవర్తిస్తుంది. ఒత్తిడి, ఆందోళనకు గురవుతాయి. ఆ సమయంలో అవి కరిచే అవకాశం ఉంది. కుక్కలు డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ సమయంలో అధిక శబ్ధం వినిపించినా, వ్యక్తులు అధికంగా తన పక్క నుంచి తిరిగినా, వాటి పక్క నుంచి హఠాత్తుగా పరుగెత్తుతున్న కుక్కలు కరిచేసే అవకాశం ఉంది.  
 
కరుస్తుందని చెప్పే సంకేతాలు


కుక్కల ప్రవర్తనను బట్టి అవి కరుస్తాయో లేదో అంచనా వేయచ్చు. అవి  కొన్ని రకాల లక్షణాలను చూపిస్తాయి. 
1. దంతాలు పటపట కొరకడం
2. కోపంగా అరవడం
3. తోక వేగంగా ఊపడం
4. తదేకంగా చూడడం
5. చెవులు కిందకి వెనుకకు వంచినట్టు చేయడం. వేసవిలో వీధి కుక్కలకి దూరంగా ఉండడం మంచిది.