Warangal MGM: వరంగల్ ఎంజీఎం సిబ్బంది తీరు మారడం లేదు. చెప్పుకోవడానికే పెద్ద దవాఖాన, సౌకర్యాల తీరు గురించి మాత్రం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తరుచూ ఏదో ఒక ఘటన ఎంజీఎం ఆస్పత్రిలో వెలుగుచూస్తూనే ఉంటోంది. అక్కడి సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై ఎన్ని విమర్శలు ఎదురైనా అధికారులు, సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే ఉంటున్నారు. తాజాగా మరో ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని దయనీయ పరిస్థితులను ఎత్తిచూపింది. అక్కడి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించే తీరు కళ్లకు కడుతోంది. నడవలేని స్థితిలో ఉన్న పేషెంట్ కు స్ట్రెచర్ లేదంటే వీల్ చైర్ కావాలని అడిగితే సిబ్బంది ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భర్త భుజాలపై మోసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలికి నెల కిందట ఎంజీఎంలో డాక్టర్లు ఆపరేషన్ చేసి అరిపాదం తొలగించారు. ఆ తర్వాత పేషెంట్ ను నెల తర్వాత వచ్చి మళ్లీ చెకప్ చేయించుకుని వెళ్లాలని సూచించారు. దీంతో శుక్రవారం రోగిని తీసుకుని తన భర్త దవాఖానాకు వచ్చారు. అయితే ఈ రోజు పెద్దసారు లేరని, రేపు రావాలని అక్కడున్న సిబ్బంది ఆ వృద్ధురాలైన పేషెంట్ ను నిర్లక్ష్యంగా వదిలేశారు. కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో పేషెంట్ ను భర్త భుజాలపైకి ఎక్కించుకొని బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై అక్కడున్న పలువురు రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వయస్సు, అవస్థను దృష్టిలో పెట్టుకునైనా హాస్పిటల్ సిబ్బంది సహకరించకపోవడంపై మండి పడుతున్నారు. ఈ మేరకు కొందరు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. కాగా, ఎంజీఎం హాస్పిటల్ లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయని, ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే పరిస్థితులు మెరుగుపడుతాయని పలువురు డిమాండ్ చేస్తున్నారు.