Warangal News :    వరంగల్ ఎంజీఎం సిబ్బంది తీరు మారడం లేదు. ఎంతైనా పెద్దాస్పత్రి, అందునా కేవలం పేదల కోసం మాత్రమే సేవలందించే ఆస్పత్రి.  సౌకర్యాల తీరు గురించి మాత్రం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తరుచూ ఏదో ఒక ‘ఘనకార్యం’ బయటపడడం, ఆ పూటకు దానిపై ఉన్నతాధికారులు, బడా నేతలు ఊదరగొట్టడం ఆ తర్వాత షరామామూలుగానే వదిలేయడం. తాజాగా జరిగిన ఘటనే అందుకు ఉదహరణ. నడవలేని స్థితిలో ఉన్న రోగికి స్ట్రెచర్ కావాలని అడిగితే ఇవ్వకపోవడంతో ఆమె భర్త వృద్ధుడైనప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో వీపుకెక్కించుకుని మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి తలెత్తింది.  


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలికి నెల కిందట ఎంజీఎంలో డాక్టర్లు ఆపరేషన్ చేసి అరిపాదం తొలగించారు. ఆ తర్వాత పేషెంట్ ను నెల తర్వాత వచ్చి మళ్లీ చెకప్ చేయించుకుని వెళ్లాలని సూచించారు. దీంతో శుక్రవారం రోగిని తీసుకుని భర్త దవాఖానకు వచ్చారు. అయితే ఈ రోజు పెద్దసారు లేరని, రేపు రావాలని అక్కడున్న సిబ్బంది ఆ వృద్ధురాలైన పేషెంట్ ను నిర్లక్ష్యంగా వదిలేశారు.  దీంతో కాలు బాగోలేక, నడవలేని స్థితిలో ఉన్న భార్యను బయటకు తీసుకెళ్లేందుకు భర్త ఆసుపత్రి సిబ్బందిని స్ట్రెచర్ కావాలని అడిగాడు.కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో పేషెంట్ ను భర్త భుజాలపైకి ఎక్కించుకొని బయటికి తీసుకొచ్చారు. 


ఈ ఘటనపై అక్కడున్న పలువురు రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వయస్సు, అవస్థను దృష్టిలో పెట్టుకునైనా హాస్పిటల్ సిబ్బంది సహకరించకపోవడంపై మండి పడుతున్నారు. ఈ మేరకు కొందరు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. కాగా, ఎంజీఎం హాస్పిటల్ లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయని, ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే పరిస్థితులు మెరుగుపడుతాయని పలువురు డిమాండ్ చేస్తున్నారు..


కొద్ది రోజుల కిందట నిజామాబాద్  ద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్‌ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. రోగి బంధువులే అతని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు.  రెండో అంతస్తులో వైద్యుడి దగ్గరకు వెళ్లాలని చీటీ ఇచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లాలంటే లిఫ్ట్‌ దాకా వెళ్లాలి. అక్కడికి వెళ్లాలంటే స్ట్రెచర్‌ కావాలి. కానీ ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ అందుబాటులో లేదు. కనీసం వీల్‌ చైర్‌ కూడా లేదు.  దాంతో లాక్కెళ్లారు. 


అందరూ చూస్తూ ఉండిపోయారే తప్ప.. ఎవరూ స్ట్రెచర్‌ తెచ్చి ఇచ్చింది లేదు. కనీసం ఏమైంది అని అడిగివాడే లేడు. వాస్తవానికి ఈ ఘటన మార్చి 31న జరిగినా బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు ఆస్పత్రి నిర్వాహకులు. కానీ ఇలాంటి విషయాలు ఆగుతాయా.. సోషల్ మీడియా ద్వారా బయటపడింది.  ఈ ఘటనపై దుమారం రేగినా  అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు.