Warangal Airport: వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి మళ్లీ అడుగులు పడుతున్నాయి. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సూచనల మేరకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆ జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఎయిర్ స్ట్రిప్ కు అదనంగా కనీసం నాలుగు వందల ఎకరాల భూమి ఇవ్వాలని ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోని విమానాశ్రయాల ప్రాధికార సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎయిర్ స్ట్రిప్ ప్రైవేటు భూములే అధికంగా ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలని సర్కారు భావిస్తోంది. తొలి దశలో చిన్న విమానాల రాకపోకలకు వీలుగా 253 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో 6 చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు గడిచిన కొన్నేళ్లుగా కసరత్తు చేస్తోంది. ఆ ఆరు ప్రాంతాలను ఏఏఐ అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై సుముఖత వ్యక్తం చేస్తూ.. ఇటీవల ప్రాథమిక నివేదిక ఇచ్చింది.
"అదనపు భూమిని కేటాయిస్తే.. నిర్మాణ వ్యవహారాలు మొదలు పెడతాం"
ఈ మేరకు తొలి దశలో వరంగల్ లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... ఏఏఐ అధికారులతో గడిచిన కొద్ది నెలలుగా సంప్రదింపులు జరుపుతోంది. తాము సూచించిన అదనపు భూమిని కేటాయిస్తే నిర్మాణ వ్యవహారాలను మొదలు పెడతామంటూ ఏఏఐ అధికారులు దాదాపు రెండు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. భూసేకరణ క్రతువును వీలైనంత త్వరగా భూములను ఏఏఐకి అందజేయాలని నిర్ణయించింది.
మామునూలులో 706 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం
వరంగల్ జిల్లా మామునూరులో హైదరాబాద్ చివరి నిజాం 706 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్ స్ట్రిప్ నిర్మించారు. 1930లో భారత్ - చైనా యుద్ధ సమయంలో ప్రభుత్వ విమానాల హ్యాంగర్ గా దీన్ని వినియోగించారు. అప్పట్లో అతిపెద్ద రన్ వేగా గా కూడా ఈ విమానాశ్రయం గుర్తింపు పొందింది. ప్రస్తుతం దీనికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం పక్కనే మామునూరు డెయిరీ పాంకు ఉన్న ఐదారు వందలు ఎకరాల్లో సుమారు 40 నుంచి 50 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అలాగే దీనితో పాటు మరో 210కి పైగా ఎకరాల ప్రైవేు భూమిని కూడా సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. సదరు ప్రైవేటు భూమి ఎంత మంది రైతులకు సంబంధించిందన్న వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆయా వ్యక్తుల నుంచి సేకరించే భూమికి ప్రత్యామ్నాయంగా డెయిరీ ఫాంకు చెందిన భూమిని కేటాయించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. డెయిరీకి మరోచోట ప్రభుత్వ భూమిని కేటాయించే ఆలోచనలో సర్కారు ఉంది. ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి 400 రూపాయల కోట్ల నుంచి 450 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఏం జరగనుందో. ఎంత త్వరగా వరంగల్ కు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందో.