Chandrayaan-3: మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర లిఖించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఈ మిషన్ లో అత్యంత కీలకమైన ల్యాండింగ్ దశ.. ఈరోజు సాయంత్రం వేళ జరగనుంది. సాయంత్రం 6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ జాబిలి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ కానుంది. అయితే ఈ చంద్రయాన్-3 మిషన్ లో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి కీలకపాత్ర పోషించారు. ఈ మిషన్ లో 2 పేలోడ్స్ (AHVC, ILSA)కి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్ వేర్ రాశారు. ఉండవల్లికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతుల సంతానం కృష్ణ కుమ్మరి. పదో తరగతి వరకు కృష్ణ విద్యాభ్యాసం అంతా ఉండవల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనే సాగింది. 


అనంతరం తిరుపతిలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (DCME) చేశారు. ఆ తర్వాత ఈ-సెట్ పరీక్ష రాసి హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కాలేజీ ప్లేస్‌మెంట్‌ లో భాగంగా టెరా డేటా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో 3.5 సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేశారు. ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే ఇస్రోలో ఐసీఆర్బీ పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. 2018 లో ఇస్రోలో ఓ యూనిట్ ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ లో గ్రూప్ 'ఏ' గెజిటెడ్ అధికారి స్థాయి ఉద్యోగం సాధించారు. 


చంద్రయాన్-3 మిషన్ కోసం 6 నెలల పాటు విధులు


చంద్రయాన్-3 మిషన్ లో అనేక కేంద్రాలు పని చేశాయి. మిషన్ లోని రెండు పేలోడ్స్ లో ఐదుగురు సభ్యులు పని చేశారు. అందులో LHVC, ILSA కు కృష్ణ డేటా ప్రాసెసింగ్ అనాలసిస్ సాఫ్ట్‌వేర్‌ రాసినట్లు తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్ పేలోడ్స్ నుంచి వచ్చే డేటాని ISTRAC, బెంగళూరు అందుకుంటాయి. చంద్రయాన్-3 మిషన్ కోసం 6 నెలల పాటు పని చేసినట్లు కృష్ణ వివరించారు. చంద్రయాన్-3 మిషన్ 100 శాతం విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.


చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ - నాసా, ఈఎస్ఏ నుంచి ఇస్రోకు మరింత సహకారం



చంద్రుడిపై ప్రయోగాలకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. చంద్రయాన్-3 జూలై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు శ్రీహరికోట రేంజ్ లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు భారత శాస్త్రవేత్తలు. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ మాడ్యుల్ సాఫ్ట్ ల్యాండ్ జరగనుంది. అయితే కీలకమైన సాఫ్ట్ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలకు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కదలికల్ని జాగ్రత్తగా నిర్వహించాలి. అందుకోసం సిగ్నల్స్ ను నిర్వహించేందుకు ఇస్రోకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సహకరిస్తామని ప్రకటించాయి.


ఆస్ట్రేలియాలోని న్యూ నోర్సియా అనే గ్రౌండ్ స్టేషన్ సైతం నేడు చంద్రుడిపై కీలకమైన ల్యాండింగ్ ప్రాసెస్ లో ఇస్రోకు సహకారం అందిస్తామని తెలిపింది. భారత్ కు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు వినియోగించే సొంత టెక్నాలజీ, యాంటెన్నాతో పాటు కమ్యూనికేషన్ కోసం, సిగ్నల్స్ ను సరైన విధంగా ట్రాక్ చేయడానికి నాసా, యూరప్ స్పేస్ ఏజెన్సీలు తమ యాంటెన్నాతో సహకరించడానికి సిద్ధంగాఉన్నాయి.