వరంగల్ : మంత్రి కేటీఆర్ మే 5వ తేదీన ఉమ్మడి వరంగల్ లో పర్యటించనున్నారని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేయాల‌ని పార్టీ ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌లను ఆయన ఆదేశించారు. ఈ మేర‌కు బుధ‌వారం హ‌న్మ‌కొండ‌లోని త‌న క్యాంపు కార్యాల‌యం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్‌, మేయ‌ర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి ర‌మేశ్‌, తాటికొండ రాజ‌య్య‌, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌, ఒడితెల స‌తీశ్‌, డిసిసిబి చైర్మ‌న్ మార్నేని ర‌వింద‌ర్ రావు, కుడా చైర్మ‌న్ సుంద‌ర్ యాద‌వ్ త‌దిత‌రుల‌తో మంత్రి స‌మీక్షించారు. 


ఈ నెల 5న వరంగల్ కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటనకు రానున్న సందర్భంగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తారు. కేటిఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన ఏర్పాట్ల‌పై మంత్రి ఎర్రబెల్లి నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.  


కేటీఆర్ పర్యటన షెడ్యూల్.. 
ఈ నెల 5వ తేదీన మంత్రి కేటీఆర్ ఉ. 10 గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల‌తోపాటు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు.
మ.3 గంటలకు హసన్ పర్తి (ఎర్రగట్టుగుట్ట) కిట్స్ కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని.. ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ తిలకిస్తారు.
అనంతరం హెచ్.ఒ.డిలు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
సా.4 గం.లకు హసన్ పర్తి బాలాజీ గార్డెన్స్ లో కేసిఆర్ కప్ ను విజేత‌ల‌కు అంద‌చేస్తారు.
సా.4.30 గం.లకు హనుమకొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
సా.5.30 గం.లకు హంటర్ రోడ్ లో సైన్స్ సెంటర్ ను ప్రారంభిస్తారు.
సా.5.50 గం.లకు లష్కర్ బజార్ మర్కజీ స్కూల్లో నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
సా.6.15 గం.లకు గాంధీనగర్ లో(అంబేధ్కర్ భవన్, టి.వి టవర్ దగ్గర) మోడల్ వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు.
సా.6.45 గం.లకు సెయింట్ గ్యాబ్రిల్ స్కూల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ప్ర‌సంగిస్తారు.
ఈ మొత్తం కార్య‌క్ర‌మాల విజ‌య‌వంతానికి కృషి చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ఆయా నేత‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అధికారిక కార్య‌క్ర‌మాల్లో అధికారులు భాగ‌స్వాముల‌వుతారు. ఇక పార్టీ కార్య‌క్ర‌మాల్లో మాత్రం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను విస్తృతంగా పాల్గొనేలా చూడాల‌ని మంత్రి సూచించారు.


స‌చివాల‌యంలో అధికారులతో సమీక్ష 
హైదరాబాద్ లో త్వరలో వార్డుల ప్రాతిపదికన పాలన పద్ధతి తీసుకురావాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ప్రతి పౌరుడికి వివిధ రకాల సేవలు వీలైనంత త్వరగా అందించాల‌నే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని కేటీఆర్ తెలిపారు. అతి త్వరలోనే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో వార్డుల పాల‌న పద్ధతి రానుందని, అందుకు చర్యలు కూడా చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం స‌చివాల‌యంలో మంత్రి కేటీఆర్ పుర‌పాల‌క శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.