ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి తల్లిదండ్రుల స్మారక నిర్మాణాన్ని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు ధ్వంసం చేయడం సంచలనం రేపుతోంది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ మేడారం జాతర సమీక్ష సమావేశానికి శనివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. రహదారికి అడ్డంగా ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో కొండా మురళి తల్లిదండ్రులైన కొండా చెన్నమ్మ, కొమురయ్యల జ్ఞాపకార్థం నిర్మించిన గద్దెలను కూల్చివేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
Also Read: దళితబంధుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలుకు సన్నద్ధం
అయితే అవి ప్రైవేటు స్థలంలో ఉన్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే చెప్పారని టీఆర్ఎస్ నాయకులు కొంతమంది కొండా మురళి తల్లిదండ్రుల స్మారక నిర్మాణాన్ని కూల్చివేశారు. కొండా సురేఖ 2010 పరకాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత నిధులతో ఈ నిర్మాణం చేశారు. సొంత స్థలంలో నిర్మించుకున్న స్థూపాన్ని ఎలా ధ్వంసం చేస్తారని కొండా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై కొండా సురేఖ ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రపోయిన సింహాన్ని తట్టిలేపావు, ఖబడ్దార్ చల్లా ధర్మారెడ్డి అంటూ హెచ్చరించారు. కాచుకో చల్లా ధర్మారెడ్డి నీ భరతం పడతామని సురేఖ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌లు కూడా ఏం చేయలేరని ఆమె హెచ్చరించారు. శిశుపాలుడిలా పాపాలు చేసుకుంటూ పోతున్నారని... నీ పాపాలు పండేరోజు దగ్గర పడిందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పరకాల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
Also Read: హైదరాబాద్‌లో మరో అద్భుతం.. మాస్కో తరహాలో హుస్సేన్ సాగర్‌పై త్వరలోనే వేలాడే వంతెన
కొండా మురళి తల్లిదండ్రుల స్థూపాలను టీఆర్ఎస్ కార్యకర్తలు కూల్చివేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన ఉన్నా.. ప్రభుత్వ స్థలంలో ఉన్నా... అధికారులు మాత్రమే వాటిని తొలగిస్తారు. ప్రైవేటు స్థలంలో ఉంటే తొలగించే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఈ ఘటన.. ముందు ముందు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణవుతుందని .. జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే అక్కడ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న కొండా సినిమా షూటింగ్ జరిగింది.