మేడారం సమ్మక్కసారలమ్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన పత్రికను కూడా స్పెషల్‌గా డిజైన్ చేసింది. గిరిజన సంప్రదాయాలు, తెలంగాణ సంస్కృతి కలగలిపి ప్రత్యేక ఆహ్వా పత్రికను రూపొందించి గిరిజన సంక్షేమ శాఖ.
గత మూడేళ్ల నుంచి మేడారం జాతర కోసం ఇలాంటి ఆహ్వాన గిఫ్ట్‌బాక్స్‌ను తయారు చేస్తోంది తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ. గిరిజన కళలు, హస్తకళల బహుమతులతో కూడిన ప్రత్యేక ఆహ్వానాన్ని సిద్ధం చేస్తున్నది. ఈ సంవత్సరం కూడా తయారుచేసిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ రెడీ చేసింది.
మేడారం జాతర కోసం తయారు చేసిన గిఫ్ట్ బాక్స్‌లో ఉన్న వస్తువులు ఇవే
1. ఆహ్వాన పత్రిక
2. కాఫీ టేబుల్ బుక్
3. కోయా/ గోండ్ పెయింటింగ్స్
4. నాయకపు గిరిజన దారు శిల్పాలు
5. ఓజా గోండ్ క్రాఫ్ట్స్
6. బంజారా క్రాఫ్ట్స్
7. సమాచార స్టిక్కర్లు
ములుగు జిల్లా మేడారంలో ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రత్యేకత తెలిసేలా గిఫ్ట్ బాక్స్ తయారు చేశారు. దీని కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. 2022 ఫిబ్రవరి 15 - 19 తేదీల మధ్య జాతరలో జరిగే రోజువారీ కార్యక్రమాల వివరాలు ఉంచారు.
గిఫ్ట్ బాక్స్‌లో కాఫీ టేబుల్ బుక్ ప్రధాన ఆకర్షణ. ఇది తెలంగాణ గిరిజనుల జీవనం ,సంస్కృతికి సంబంధించిన అన్ని ముఖ్యమైన లక్షణాలను ఆకర్షణీయమైన చిత్రాలతో స్థూలంగా వివరిస్తుంది. గిఫ్ట్ బాక్స్‌లో అందమైన ఫ్రేమ్‌లలో అమర్చిన కోయ లేదా గోండ్ పెయింటింగ్‌లు ఉన్నాయి. అవి సాంప్రదాయకమైనవి, ఆయా గిరిజన యువ కళాకారులే వీటిని తయారు చేశారు. నాయకపు గిరిజన కళాకారులు ప్రత్యేకంగా రంగురంగులతో తయారుచేసిన “శిరస్సులు”అనే దారు కళాఖండాలనూ ఈ బాక్స్ లో అమర్చారు.
మైనపు సాంకేతికతతో ఓజా గోండ్స్ తయారు చేసిన ఇత్తడి క్రాఫ్ట్ - తాబేలు కూడా బాక్స్‌లో ఉంచారు. లంబాడీ స్త్రీలు నేసిన బంజారా హస్తకళ పొట్లీ / పౌచ్ ఉంచారు. ఇది సమ్మక్క దేవి పవిత్రమైన పసుపు పొడితో పెట్టెలో అమర్చారు.
ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు, VVIPలను ఆహ్వానించడానికి ఈ అమూల్యమైన గిఫ్ట్ బాక్స్‌ను రెడీ చేసింది గిరిజన సంక్షేమ శాఖ. చాలా మందిని కలిసి గిఫ్ట్ బాక్స్ అందజేసి జాతరకు రావాల్సిందిగా ఆహ్వానిస్తోంది.