జనగామను బంగారు జిల్లాగా మార్చేలా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గత ఏడేళ్లుగా ఉద్యోగులు కష్టపడి పని చేశారని, అలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. నేడు రాష్ట్రంలో ఏ నిర్ణయమైనా, పథకం అయినా నిమిషాల మీద అమలు చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. జనగామలో జిల్లా కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ భవనాన్ని అద్భుతంగా కట్టినందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. భవన ఆర్కిటెక్ట్ ఉషను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేసీఆర్ ఉద్యోగులు, తెలంగాణలో జరిగిన మార్పుల గురించి మాట్లాడారు.


‘‘తెలంగాణలో 24 గంటల కరెంటును అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడా జనరేటర్లు, ఇన్వర్టర్లు కనిపించడం లేదు. నవ్వినోళ్లే మనల్ని చూసి ఇప్పుడు ఏడుస్తున్నరు. ఇవాళ జిల్లాల్లో ఇంత పెద్ద కలెక్టరేట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నం. కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్ కూడా ఇంత అద్భుతంగా లేవు. ఎన్నడైనా అనుకున్నమా జనగామలో ఇంత అద్భుతమైన కలెక్టరేట్ వస్తదని? ఇవన్ని మనం చేసుకుంటేనే అవుతయ్. భూముల విలువలు కూడా అట్లనే పెరిగినయ్. మూడెకరాలు ఉండే రైతు ఇవాళ కోటీశ్వరుడు అయ్యాడు. ఎకరం 2 లక్షలుండే జనగామలో 20 నుంచి 30 లక్షలకు చేరింది. యాదాద్రి సమీపంలో పూటకో రేటు ఉంటుంది. దేశంలో టాప్ 10 గ్రామాలు ఎంపికైతే అందులో ఏడు గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతాన్ని చూసి జయశంకర్ సార్ బాధపడేవారు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ఆనందపడేవారు. 


జనగామ జిల్లాను కూడా చాలా అర్థవంతంగా, స్పష్టమైన వైఖరితో, అభివృద్ధిని కోరి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. భూపాలపల్లి, జనగామ ప్రాంతాలు పక్కపక్కనే ఉంటయ్. అయినా అభివృద్ధి కోసం రెండింటిని జిల్లాలు చేసుకున్నాం. అందుకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సలహాలు ఇచ్చారు. మారుమూల ప్రాంతాల్లోనూ డెవెలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే జిల్లాలు ఏర్పాటు చేశాం. త్వరలోనే తెలంగాణ తలసరి ఆదాయం 2.70 లక్షలకు చేరుకోబోతోంది. అదే ఏపీలో తలసరి ఆదాయం 1.7 లక్షలే ఉంది. తెలంగాణ అద్భుత సంపద కల ధనిక రాష్ట్రం. భవిష్యత్తులో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నాకు తెలుసు. 


‘‘తెలంగాణలో అద్భుతమైన శాంతి భద్రతలు ఉన్నాయి. రిటైర్డ్ జడ్జిలు, ఇతర రాష్ట్రాలకు చెందిన అఖిల భారత అధికారులు రిటైరైన సొంత ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు, తెలంగాణలో రైతు వేదికలు రెండేళ్లలోనే 2 వేలకు పైగా కట్టారు. పథకాలు, నిర్ణయాల అమలు ఇప్పుడు నిమిషాల్లో జరుగుతోంది. దేశమే తెలంగాణ వచ్చి విధానాలను నేర్చుకుంటున్న పరిస్థితి ఉందిప్పుడు. తెలంగాణలో అభివృద్ధి కేంద్రాలు మరిన్ని రాబోతున్నాయి. వాటి నుంచి పరిమణాలు వెదజల్లనున్నాయి. ప్రభుత్వ అధికారులు తమ పనిని ఇంతే కొనసాగించాలి. భవిష్యత్తులో మనం ఊహించని విధంగా మనకు ఫలాలు అందనున్నాయి.’’


ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల రూల్ బుక్ అనేది సరళ తరంగా తయారు చేసుకోవాలి. రాష్ట్రం కోసం ఆయన పడే శ్రమకు కృత‌జ్ఞతగా.. ఆయన రిటైర్ అయితే, ఆ పదవి విరమణ సొమ్ము చేతికి అందించి సన్మానం చేసి ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దిగబెట్టే పద్ధతి రావాలి.’’ అని సూచించారు. 


సీఎంపై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసలు
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం ప్రసంగం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన పార్లమెంటు నియోజకవర్గం అయిన జనగామలో అద్భుత కలెక్టరేట్ భవనం కట్టించినందుకు కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోరాటాలకు మారుపేరుగా ఉన్న జనగామలో చేర్యాల నియోజకవర్గం కూడా కలపాలని కోరారు. దాన్ని రెవెన్యూ డివిజన్ కావాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ‘‘జనగామకు మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఇస్తామని గతంలో మీరు హామీ ఇచ్చారు. అవి తెస్తారని నాకు నమ్మకం ఉంది. బస్టాండ్ సమస్యను కూడా పరిష్కరించాలి.’’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు.