గత 12 ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో సాగుతున్న పోడు భూముల రగడకు ఓ పారెస్ట్‌ అధికారి బలయ్యాడు. అడవినే నమ్ముకుని జీవిస్తున్న తమకు హక్కు పత్రాలు రావాలని గిరిజనులు ఓ వైపు.. అడవిని కాపాడాలని అటవీ అధికారులు మరోవైపు చేరడంతో ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం పోడు భూముల రగడ మండుతూనే ఉంది. దీనికి చెక్‌ పెట్టి పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని అమలు చేయడంలో జాప్యం చేయడంతో ఇప్పుడు ఏకంగా ఓ ఫారెస్ట్‌ అధికారి పోడు భూముల వివాదానికి బలికావాల్సి వచ్చింది.


పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టాలిచ్చేందుకు 2005లో అటవీ హక్కుల చట్టం పేరుతో పట్టాలను పంపిణీ చేశారు. ఈ చట్టం ప్రకారం 2005కు ముందు సాగులో ఉన్న అటవీ భూములకు 10 ఎకరాలకు మించకుండా లబ్ధిదారులకు అందజేశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ అటవీ హక్కుల చట్టం ద్వారా 99,486 మంది లబ్ధిదారులకు 3,31,07 ఎకరాలకు పట్టాలు అందించారు. ఈ ప్రస్థానం 2010 వరకు సాగింది. అనంతరం పోడు భూములకు సంబంధించిన పట్టాల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే పట్టాలు రాని భూములను అటవీశాఖ అధికారులు తమ భూబాగంలో కలుపుకునేందుకు భూముల్లో ప్లాంటేషన్‌ వేయడంతోపాటు ట్రెంచ్‌లను ఏర్పాటుచేసేందుకు ముందుకు సాగారు. 


అప్పట్నుంచి పోడు సాగు చేసుకుంటున్న రైతులకు అటవీశాఖ అధికారులకు మద్య గొడవలు సాగుతూనే ఉన్నాయి. వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలో పోడు భూములకు పట్టాలివ్వాలనే అనేక ఉద్యమాలు జరిగాయి. ఇటీవల కాలంలో పారెస్ట్, పోలీసు అధికారులు సంయుక్తంగా పోడు భూములను స్వాదీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడంతో రెండు వర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది.


మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు..


తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఛైర్మన్‌గా మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఈ కమిటీ మూడు, నాలుగు దఫాలుగా సమావేశం అయింది. ఈ కమిటీ విధివిధానాలు రూపొందించి దరఖాస్తులు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82,737 దరఖాస్తులు, ఖమ్మం జిల్లాలో 18,603 దరఖాస్తులు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 7,515 దరఖాస్తులు, వరంగల్‌ జిల్లాలో 7,389 దరఖాస్తులు, ములుగు జిల్లాలో 28,860 దరఖాస్తులు, ఆదిలాబాద్‌ జిల్లాలో 18,884 దరఖాస్తులు, మంచిర్యాల జిల్లాలో 11,774 దరఖాస్తులు, నిర్మల్‌ జిల్లాలో 8,666 దరఖాస్తులు, ఆసీఫాబాద్‌ జిల్లాలో 26,680 ధరఖాస్తులు, మహబూబాబాద్‌ జిల్లాలో 32,697 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు పట్టాల పంపిణీ ప్రక్రియ జరగకపోవడంతో మళ్లీ అటవీ అధికారులు, పోడు సాగుదారుల మధ్య పోరు సాగుతూనే ఉంది. గత రెండేళ్లుగా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అమలు కాకపోవడంతో పోడు భూముల పోరు ఏజెన్సీలో సాగుతూనే ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పోడు భూముల సమస్య అధికంగా ఉంది.


ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా ఈ సమస్య..


పోడు భూములకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలోనే అధికంగా ఈ సమస్య ఉంది. దీంతోపాటు ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దు ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంది. ఛత్తీస్‌ఘడ్‌లో పోలీసులు, నక్సల్స్‌ మధ్య నలిగిన గుత్తికోయలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు ములుగు జిల్లాలోకి వచ్చి అడవిలోనే పోడు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే వీరి వలసల వల్ల పోడు భూములు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే అడవిని కాపాడేందుకు ట్రెంచ్‌ కొడుతున్న పారెస్ట్‌ అధికారులకు గిరిజనులకు మద్య ఇప్పటికీ వివాదం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ఎర్రబోడు గ్రామంలో వలస గొత్తికోయలు ఫారెస్ట్‌ అధికారులు పెంచుతున్న మొక్కలను నరికేందుకు ప్రయత్నించడం, అధికారిపై గుత్తికోయలు గొడళ్లతో దాడి చేయడంతో ఆయన మృత్యువాత పడాల్సిన పరిస్థితి నెలకొంది.