Mahabubnagar News: తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవేందర్ కుమారుడు 23 ఏళ్ల అక్షయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ నివాసంలో అక్షయ్ కుమార్ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇన్స్ పెక్టర్ గోనె సురేష్ పలు విషయాలను తెలిపారు. మహబూబ్ నగర్ లోని మోనప్పగుట్టకు చెందిన దేవేందర్ కుమారుడు అక్షయ్ కుమార్ బీటెక్ పూర్తి చేశారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం రావడంతో పది రోజుల క్రితం హైదరబాద్ వచ్చారు. మేనబావ గల్లా నవీన్ కుమార్ వద్ద ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నారు. ఆయన ఈనెల 20వ తేదీన స్వగ్రామానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.


సోమవారం ఉదయం 11 గంటలకు నవీన్ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ తలుపులు వేసి ఉన్నాయి. అక్షయ్ ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసి లోపలికి వెళ్లారు. అప్పటికే అక్షయ్ కుమార్ పడక గదిలో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తున్న కుమారుడు అలా అచేతనంగా ఉండడం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు... మృతదేహాన్ని కిందకు దింపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అక్షయ్ కుమార్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. 


మహబూబ్ నగర్ లో రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో సెప్టెంబర్ 30వ తేదీన గ్రామీణ ఠాణా పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అందులో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన ఇద్దరు వ్యక్తుల నుంచి డబ్బు తీసుకున్నారని పోలీసుల అరెస్ట్ సమయంలో వెల్లడించారు. తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే అక్షయ్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.  


పరీక్ష తప్పాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య..


పరీక్షల భయం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది. నిజామాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన అందర్నీ విషాదంలో నింపింది. స్థానిక  వీఆర్‌ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని పరీక్షల భయంతో బిల్డింగ్‌పై నుంచి దూకేసింది. నిజామాబాద్‌లోని వీఆర్‌ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న పదిహేడేళ్ల అక్షిత సూసైడ్‌ చేసుకోవడం కలకలం రేపింది. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత ఆదివారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్‌ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. 
అక్షిత సూసైడ్ విషయం గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని కాలేజీ సిబ్బందికి చెప్పారు. వెంటనే ఈ స్పందించిన ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అక్షిత మృతి చెందింది. అక్షిత పాలిటెక్నిక్‌ ఈసీఈ విద్యార్థిని. ఇటీవలే మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఆమె ఒక సబ్జెక్ట్‌లో తప్పింది.  మొదటి సెమిస్టర్‌లోనే ఒక సబ్జెక్ట్‌ తప్పిన అక్షితకు పరీక్షలంటేనే భయం పట్టుకుంది. తరచూ తోటి స్నేహితుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించేది. రేపటి(మంగళవారం) నుంచి రెండో సమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో సూసైడ్ చేసుకుంది.