Mulugu News: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిస్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు అదనపు కలెక్టర్ ఇలా ట్రిపాఠి, ఆమె భర్త కలెక్టర్ భవేష్ మిశ్రాకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రబుత్వాసుపత్రిలో కలెక్టర్ ప్రసవించడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్లే ప్రజల మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వాసుపత్రిని ఎంచుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయలు బాగుండడం వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. 






సోమవారం ఉదయం నుంచి పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ.. శిశివు బరువు ఎక్కువగా ఉండటంతో సాధ్య పడలేదు. దీంతో సీ సెక్షన్ చేసి బిడ్డను బయటకు తీయాలని నిర్ణయించారు. గైనకాలజిస్టులు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్ చేశారు. ఇలా త్రిపాఠి మగ శివువుకు జన్మనిచ్చారు. శిశువు 3 కిలోల 400 గ్రాముల బరువుతో పూర్తి ఆరోగ్యంగా పుట్టినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. 


గతేడాది ఖమ్మం కలెక్టర్, అదనపు కలెక్టర్లూ ప్రభుత్వాసుపత్రిలోనే


ఇటీవల ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి జాయిన్ అయ్యి ఆడపిల్లకు జన్మనిచ్చారు.  ఆ తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అదే మార్గంలో నడిచారు. కలెక్టర్ అనుదీప్ తన భార్యను ప్రసవం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కలెక్టర్ భార్య ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. సీనియర్ డాక్టర్లు రామకృష్ణ భార్గవి నేతృత్వంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్య బృందం శ్రీకాంత్, డా. దేవిక, కల్యాణి, రాజ్యలక్ష్మి.. విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి డెలివరీ చేశారు.


ఐఏఎస్ అయినా కార్పొరేట్ వైద్యం అంటూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రసవం కోసం భార్యను చేర్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ సామాన్యులకు స్ఫూర్తిగా నిలిచారు. ఏ భయాలు లేకుండా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం చర్యలతో సర్కార్ దవాఖానాలలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఐఏఎస్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల బాట పట్టడం సామాన్యులకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.
ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ప్రసవం..
ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత అక్టోబర్ చివరి వారంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి జాయిన్ అయ్యి ఆడపిల్లకు జన్మనిచ్చారు. సామాన్య మహిళగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకుని... అనంతరం ఆపరేషన్ చేసిన డాక్టర్లు డెలివరీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచేందుకు మొదటగా తామే చికిత్స తీసుకుని నిరూపిస్తున్నారు. అది కూడా ప్రసవం లాంటి ముఖ్యమైన చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం శుభపరిణామం.