కేసీఆర్ అనారోగ్యం పాలైన నాటి నుంచి ఆయన బయటికి రాకపోవడంతో అనేక పుకార్లు వస్తున్న వేళ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. రేపో మాపో పులి బ‌య‌ట‌కు వ‌స్తదని.. వ‌చ్చిన త‌ర్వాత ఇవాళ ఎగిరెగిరి ప‌డుతున్న న‌క్కల‌న్నీ మ‌ళ్లీ తొర్రల‌కే పోతాయ‌ని కేటీఆర్ సెటైర్లు వేశారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో జరిగిన ప్రగ‌తి నివేద‌న స‌భ‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నిక‌ల వేళ ఏం చేయాలో కేసీఆర్ ఈ విశ్రాంతి వేళ కేటీఆర్ లెక్కలు వేస్తున్నారని తెలిపారు. ఎందుకంటే మ‌నం ఏం మాట్లాడినా బాధ్యత‌తో మాట్లాడతామని అన్నారు. 


రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ.. ‘‘కాంగ్రెస్‌ను న‌మ్మే బుద్ది త‌క్కువ ప‌రిస్థితిలో మ‌నం ఉన్నామా? 60 ఏళ్లు మ‌న‌ల్ని వేధించారు. ఇవాళ వ‌చ్చి ప్రశ్నలు వేస్తున్నారు. కాంగ్రెసోనిది ఏం పోయింది. నెత్తి వానిది కాదు.. క‌త్తి వానిది కాదు.. ఎటుబడితే అటు గీకుతాడు. వాడు గెలిచేది లేదు, పీకేది లేదు’’ అని మాట్లాడారు.


కాంగ్రెస్ ఉన్నప్పుడు పింఛను రూ.200 ఇచ్చేవారని, అంత‌కుముందు తెలుగుదేశం రూ.75 ఇచ్చిందని అన్నారు. పదేళ్ల క్రితం కేసీఆర్‌ను గెలిపించుకున్న త‌ర్వాత రూ.200 ఉన్న పింఛను 10 రెట్లు పెరిగి.. రూ. 2 వేలు అయిందని అన్నారు. అలాగే దివ్యాంగుల‌కు కూడా పింఛన్లు పెంచామని అన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో 29 ల‌క్షల మందికి పింఛన్లు వస్తే.. ఇప్పుడు 46 ల‌క్షల మందికి వస్తున్నాయని గుర్తు చేశారు. బీడీలు చుట్టేవారు 16 రాష్ట్రాల్లో ఉంటే.. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికుల‌కు పింఛన్లు ఇస్తున్నారా? అని అడిగారు. ఆ దిశ‌గా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవ‌రైనా ఉన్నారా అని ప్రశ్నించారు. రెండున్నర ల‌క్షల మంది ఒంట‌రి మ‌హిళ‌ల‌కు పింఛన్లు ఇచ్చే ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నారా? అని కేటీఆర్ అడిగారు.


ఆ మొగోడు చెప్తే ఓటు వేయాలా?
‘‘కాంగెస్‌ వాళ్ళకు దిక్కు లేక నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన సన్నాసిని పట్టుకొని పీసీసీ పదవి ఇచ్చారు. ఆ మొగోడు చెబితే మనం ఓట్లేయాలంట. సోనియమ్మని బలి దేవత అన్నాడు. 1200 మందిని బలి తీసుకున్నవారు దేవత కాదు బలిదేవత అన్నాడు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అన్నాడు. ఇప్పుడు ముద్దపప్పు కాదు.. సుద్ద పప్పు అంటున్నడు. ఆయన మాటలు నమ్ముదమా? నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన థర్డ్ రేట్ దొంగ రేవంత్ రెడ్డి. క్రిమినల్ లాంటి వారి చేతిలో రాష్ట్రాన్ని పెడదామా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.


‘‘మొన్న ఓటుకు నోటు కేసు.. ఈ రోజు సీటుకో రేటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ‘రేటెంత రెడ్డి’గా మారారు. అలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఆదానికో, అంబానికి అమ్మేస్తారు. కాంగ్రెస్ హామీలను చూసి మా కార్యకర్తలు ఆందోళన పడుతున్నారు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా?’’ అని కేటీఆర్ మాట్లాడారు.