ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అంచనాలు మధ్య తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇదే
పోలింగ్ తేదీ- 30 నవంబర్ 2023
కౌంటింగ్ తేదీ- 3 డిసెంబర్ 2023
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్: 3 నవంబర్ 2023
ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తేదీ- 3 నవంబర్ 2023
ఎన్నికల నామినేషన్లకు తుది గడువు - 10 నవంబర్ 2023
నామినేషన్ల స్క్రూట్నీ తేదీ- 13 నవంబర్ 2023
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ- 15 నవంబర్ 2023
2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్‌ఎస్, అప్పటి టీఆర్‌ఎస్... 119 స్థానలకుగాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా... 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పుడు కూడా 119 స్థానలకుగాను 87 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడినప్పటికీ 22 స్థానాలు మాత్రమే దక్కించుకున్నాయి. ఇక, ఎంఐఎం ఏడు, ఇండిపెండెంట్లు రెండు, బీజేపీ ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 46.87శాతం ఓట్లును సాధించింది. ఇక... కాంగ్రెస్‌కు 19 సీట్లు వచ్చినా 28.43శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది. బీజేపీకి 6.98 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. 2018 తర్వాత జరిగిన ఉపఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో బీఆర్‌ఎస్ గెలిచినా... బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.
ఓటర్ల సంఖ్య
రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు కోటి 58 లక్షల 71 వేల 493 మంది ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక మహిళా ఓటర్లు కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నట్లు ప్రకటించింది. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల సంఖ్య 5.8 శాతం పెరిగినట్లు పేర్కొంది. కొత్త ఓటర్ల సంఖ్య 17.01 లక్షలుగా ఉండగా.. 6.10 లక్షల ఓట్లను తొలగించినట్లు ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా లింగ నిష్పత్తి 998: 1000గా ఉందని తెలిపింది. ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్లను తొలగించిన తర్వాత 10 లక్షల మంది ఓటర్లు పెరిగారు. బోగస్ ఓట్లు తొలగింపు, రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేపట్టిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ఈసీ సిద్దం చేసింది.
ఓటర్ల జాబితాను సీఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు బూత్‌ల వద్ద లేదా వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితాను చెక్ చేసుకోవచ్చని ఈసీ పేర్కొంది. గత ఎన్నికల సమయంలో కూడా అక్టోబర్ నెలలోనే షెడ్యూల్ వచ్చింది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినా.. అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో కాంగ్రెస్ తొలి జాబితా రానుంది.