Minister KTR: మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. పర్యటనలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్ తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్నారు.
పరిశ్రమలకు ఊతం ఇస్తేనే ఉపాధి లభిస్తుందని, రాష్ట్రానికి సంపద వస్తుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మించనున్న అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీకి కేటీఆర్ భూమిపూజ చేశారు. అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్ తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్నారు. లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో దేశంలోనే ఇది అతిపెద్ద పెట్టుబడి అని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడిని పెడుతున్నందుకు అమరరాజా గ్రూప్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తదేకమైన దీక్షతోనే పెట్టుబడులు
తదేకమైన దీక్ష, పట్టుదలతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇదీ పోటీ ప్రపంచమని పోటీ ప్రపంచంలో అవినీతి రహిత పారదర్శకమైన పాలనతో ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. భారత దేశంలో ఎక్కడైనా అమరరాజా గ్రూప్ ప్లాంట్ పెట్టుకోవచ్చని, దివిటిపల్లిలో ప్లాంట్ పెడతామని అమరరాజా గ్రూప్ ప్రకటించిన తర్వాత 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు వారికి ఫోన్ చేసినట్లు తమ తమ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. కానీ అమరరాజా గ్రూప్ మాత్రం తెలంగాణలోనే ప్లాంట్ పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ
ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు అంతర్జాతీయ వేదికలపై ఆయా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పుకొచ్చారు కేటీఆర్. మా వద్ద సరిపడ కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయని, మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మనకున్న శక్తి యువశక్తి అని చెప్పారు. 27 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు 70 కోట్ల మంది ఉన్నారని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు కాబట్టి, వారికి ఉపాధి కల్పించాలంటే ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు వస్తాయని, రాష్ట్రానికి సంపద వస్తుందని చెప్పారు. ఈ సంపదను పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు ఉపయోగిస్తామని తెలిపారు.
అమరరాజా కంపెనీతో 10 వేల మందికి ఉపాధి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సమయానికి హైదరాబాద్ ఐటీ రంగంలో 3.23 లక్షల మంది పని చేసేవారని, కానీ ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఒక ఐటీ కంపెనీ ఉంటే దాని చుట్టూ ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. అమరరాజా కంపెనీ రావడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. దీని వల్ల చుట్టు పక్కల ప్రాంతాల రూపు రేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఇతర పరిశ్రమలు కూడా వస్తాయని పేర్కొన్నారు.
పదేళ్లలో రూ.9,500 కోట్ల పెట్టుబడి
అమరరాజా గ్రూప్ రాబోయే పదేళ్లలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు మంత్రి తెలిపారు. మూడేళ్లలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని, మిగతా పెట్టుబడి దశల వారీగా ఉంటుందని వెల్లడించారు. అమరరాజా 37 ఏళ్ల చరిత్ర పరిశీలిస్తే.. దానికి రెట్టింపు ఈ ఒక్క ప్లాంట్ లోనే పెట్టుబడి పెడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.