సమ్మక్క గిరిజనుల ఆరాధ్య దేవత మాత్రమే కాదు.. గిరిజనులేతర ఇలవేల్పు కూడా. కోట్లాది మంది భక్తుల చేత వేవేల పూజలందుకుంటోన్న వన దేవత. ధీరత్వమే దైవత్వమైన సజీవ సాక్ష్యం సమ్మక్క. ఇంతటి విశ్వాసం వెనుక కారణమేంటి..? జన గుడారంలా మారిపోయే మేడారం మహాజాతర చారిత్రక సత్యాలేంటి? 


బయ్యక్కపేట గ్రామంలోని  మేడరాజుకు పెద్ద భార్య చందబోయిరాలు, చిన్న భార్య కనకంబోయిరాలు. వీరికి  సంతానం లేకపోవడంతో పెద్ద భార్య ఆదిశక్తిని, చిన్న భార్య నాగదేవతను పూజించారు. ఓ రోజున చందబోయిరాలు దుంపల కోసం కొంత మంది మహిళలతో కలిసి అడవికి వెళ్లింది.  మాఘశుద్ద పౌర్ణమి రోజు అడవిలో గిరిజనులు ఆహరంగా తీసుకునే  ఎల్లేరు గడ్డను తవ్వుతుండగా గుణపానికి ఏదో తగిలింది. పూర్తిగా తవ్వి బయటకు తీసి చూడగా పెట్టెలో పసిబిడ్డ కనిపించింది. ఆదిశక్తి ప్రసాదించిన సంతానంగా భావించి కన్నుల పండుగగా మేళతాళాలతో ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సమ్మక్కగా నామకరణం చేసి పెంచుకున్నారు. చిన్న వయసులోనే సమ్మక్క ప్రతిభను, తెలివితేటలను, యుద్ధ రీతులను చూసిన గిరిజనులు ఆశ్చర్యానికి గురయ్యేవారు. రోగాలను నయం చేయడంలో సమ్మక్క సిద్ధహస్తురాలిగా పిలువబడేది. ఆ వన దేవత చేతితో ఆకపసరు అందిస్తే ఎంతటి భయకరంమైన వ్యాధి అయినా నయం అయ్యేది. సమ్మక్కకు యుక్తవయసురాగానే పూనుగొండ్లకు చెందిన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. దీంతో సమ్మక్క పుట్టినిల్లు బయ్యక్కపేట, మెట్టినిల్లు పూనుగొండ్లగా నిలిచింది.  
బయ్యక్కపేట గ్రామం ప్రస్తుతం జాతర జరిగే మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1943  వరకూ సమ్మక్క, సరాలమ్మల జాతరను బయ్యక్కపేటలోనే చందావశస్థులు  నిర్వహించేవారు. గ్రామంలో సమ్మక్కకు గుడితో పాటు గద్దె కూడా నిర్మించి జంతువును బలి ఇస్తూ మొదటగా ఏడాదికోసారి జాతరను నిర్వహించేవారు. జాతర సమయంలో  సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న  భక్తులకు కొంగు బంగారమయ్యారు. క్రమ క్రమంగా అమ్మవార్ల విశిష్టత దేశమంతా తెలియడంతో భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరడం మొదలైంది. దీంతో బయ్యకపేట గ్రామంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం కష్టతరంగా మారింది. 


జాతరకు వస్తున్న భక్తులకు నీటి సౌకర్యం, వసతి సౌకర్యాలు కల్పించడం చందా వశస్తులకు సవాల్ గా మారింది. వీటితోపాటు జాతర ముగిసిన తరువాత బయ్యకపేట గ్రామంలో విపరీతంగా అంటూ వ్యాధులు ప్రబలి ప్రాణ నష్టం జరిగేది. ఈ సమస్యలను అధిగమించేందుకు చందా వంశస్తులు జాతరను జంపన్న వాగు సమీపంలోని మేడారం గ్రామనికి తరలించాలని నిర్ణయించారు. మేడారం గ్రామానికి సమీపంలో చిలకలగుట్టు ఉండటం, నీటి సౌకర్యం పుష్కలంగా ఉండటంతో అక్కడకు  జాతరను తరలించారు. 1944 జనవరి 6న శ్రీముఖ నామ సంవత్సంరంలో బయ్యక్కపేట నుంచి మేడారానికి జాతరను తరలించారు. ములుగు తహసీల్దారు సమక్షంలో మేడారంలో జాతర నిర్వహణ గురించి 7 గ్రామాల పెద్దలతో కమిటీగా ఏర్పాటు చేసి మేడారంలో జాతర నిర్వహణ ప్రారంభించారు.


బయ్యక్కపేట నుంచి చందా పరమయ్య, కామారం నుంచి కొవెల్లి బుచ్చయ్య, దొడ్డ నుంచి కోరం కనకయ్య, ఊరట్టం నుంచి చర్మం మల్లయ్య, కాటాపూర్ నుంచి మహిపతి చిన్న కిష్టయ్య, కామారం నుంచి రేగ సీతయ్య, కామారం నుంచి సిద్ధబోయిన చిన్న పుల్లయ్యలు కమిటీ ఒప్పద్ధం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో జాతరను రెండేళ్లకోసారి నిర్వహించాలని, జాతర నిర్వహణ ఖర్చులను ముందుగా ఈ 7 గ్రామాల పెద్దలు సమానంగా ఖర్చుచేసి జాతర అనంతరం వచ్చిన ఆదాయంను మొదటగా ఖర్చు చేసిన సొమ్మను తీసివేసి 7 గ్రామాల పెద్దలు సమానంగా పంచుకోవాలని ప్రభుత్వం ఏమైన ఖర్చు చేస్తే ప్రభుత్వానికి కూడా ఒక వాటను అందించాలని తలహసీల్దారు సమక్షంలో రాతపూర్వకంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వం ఆదాయం పంపకాల విషయంలో ఆటంకం కలిగిస్తే 1946 నుంచి 1954 వరకు కోర్టులో గిరిజనులు కేసువేసి వాటాను సాధించుకున్నారు.


బయ్యక్కపేట గ్రామంలో ఇప్పటికీ ఆలయంలో చందావశస్థులు నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి బుధవారం గిరిజన సాంప్రదాయాల ప్రకారం నిష్టతో పూజలు చేస్తున్నారు. జాతర సమయంలో బయ్యక్కపేట గ్రామంలో ప్రజలు అందరూ మంచాలపై కాకుండా నేలపై పడుకొని అమ్మవార్లకు గౌరవం అందిస్తారు. బయ్యక్కపేట గ్రామానికి సమీపంలోని అడవిలో దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క స్నానమాడిన కొలను ఉంది. ఈ కొలనులో ఎప్పటికి నీరు ఎండిపోదని గ్రామస్థులు చెబుతున్నారు.