Mahabubabad Parliament Constituency: మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంగా కొనసాగుతుంది. ఈ నియోజకవర్గం 2009 కి ముందు వరంగల్ పార్లమెంట్ జనరల్ స్థానంగా కొనసాగింది. 2009 లో నియోజకవర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గం ఏర్పడి ఎస్టీ రిజర్వుడు అయ్యింది.
ఈ నియోజకవర్గంలో ఆదివాసి గిరిజనులు, లంబాడీల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. వరంగల్ పార్లమెంట్ స్థానంగా ఉన్నప్పుడు 1952 నుంచి 2004 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు గెలవడం జరిగింది. 2009లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన తరువాత 2009, 2014, 2019 మూడు సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు బీఅర్ఎస్, ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
2009లో
2009లో ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాంనాయక్, మహాకూటమి సీపీఐ నుంచి కుంజా శ్రీనివాసరావు, ప్రజారాజ్యం పార్టీ నుంచి డీటీ నాయక్ పోటీపడ్డారు. 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పోరిక బలరాం నాయక్‌కు సమీప ప్రత్యర్థి సీపీఐ కుంజా శ్రీనివాసరావు పై 68 వేల 957 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి సీతారాం నాయక్, కాంగ్రెస్ నుండి బలరాం నాయక్, టీడీపీ నుండి మోహన్ లాల్, ఎస్సార్ సీపీ నుండి తెల్లం వెంకట్రావు పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై సీతారాం నాయక్ 34 వేల 992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
2019లో
2019 ఎన్నికల్లో టీఅర్ఎస్ నుండి మలోతు కవిత, కాంగ్రెస్ నుండి బలరాం నాయక్, బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్, సీపీఐ నుండి వెంకటేశ్వర రావు పోటీ చేయగా.. మాలోతు కవిత లక్షా 46 వేల 660 ఓట్ల మెజార్టీతో బలరాం నాయక్ పై విజయం సాధించారు.
2024లో జరుగుతున్న ఎన్నికల్లో బీఅర్ఎస్ నుంచి మాలోతు కవిత, కాంగ్రెస్ నుండి బలరాం నాయక్, బీజేపీ నుండి సీతారాం నాయక్ లు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒకరు సిట్టింగ్ అయితే ఇద్దరు ఎంపీలుగా పనిచేసిన వారు కావడం విశేషం. ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, నర్సంపేట, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. భద్రాచలం ఒక్కటి బీఅర్ఎస్ గెలవగా మిగితా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. భద్రాచలం బీఅర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.