Warangal Lok Sabha constituency: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయాలు ఇతర స్థానాలకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ పోటీ చేసే ప్రధాన పార్టీల్లోని అభ్యర్థులు పార్టీలు మారిన నేతలు కావడం.. ఈ స్థానం నుంచి గురువు, శిష్యులు రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. గురువు కడియం కూతురు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవగా.. ఆయన శిష్యుడు బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. దీంతో వరంగల్ పార్లమెంట్ లో గురుశిష్యుల ఎలక్షన్ వార్ మొదలైంది.
గురుశిష్యులకు సవాలుగా మారిన వరంగల్ ఎంపీ స్థానం
చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ పార్లమెంటు స్థానంలో గురువు శిష్యులకు ఈ ఎన్నిక సవాలుగా మారింది. దీంతో గురువు శిష్యులు నువ్వా నేనా అనే విధంగా పోటీపడుతున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పోటీలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు. అయితే కడియం కావ్య తండ్రి కడియం శ్రీహరి శిష్యుడే ఆరూరి రమేష్ కావడం వరంగల్ పార్లమెంట్ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. కడియం శ్రీహరి తన కూతురు కావ్యను రాజకీయ వారసురాలిగా చేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కింది, కానీ విజయం కష్టమని భావించిన కడియం శ్రీహరి, కూతురుతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ నుండి వరంగల్ పార్లమెంటు టికెట్ దక్కించుకున్నారు. ప్రధాన ప్రత్యర్థిగా శిష్యుడు ఆరూరి రమేష్ పోటీలో ఉండడంతో కూతురు విజయం కోసం తండ్రి కడియం శ్రీహరి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన ఆరూరి రమేష్ కాంట్రాక్టర్. గతంలో తెలుగుదేశం కార్యకర్తగా, కడియం శ్రీహరి శిష్యునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కడియం శ్రీహరికి నమ్మిన బంటుగా ఉన్న ఆరూరి రమేష్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గురువుపై పోటీకి దిగారు. గురువు కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, శిష్యుడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. కాంగ్రెస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య విజయం సాధించారు. అప్పటినుంచి కడియం కడియం శ్రీహరికి రమేష్ రాజకీయ ప్రత్యర్థిగా మారారు.
ఒకే పార్టీలో ఉన్నా అదే పరిస్థితి..
2009 ఎన్నికల అనంతరం ఆరూరి రమేష్ రమేష్ పీఆర్పీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువు కడియం శ్రీహరి సైతం 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కడియం కంటే ముందే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లో ఉండడంతో ఆరూరి రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గానికి మారారు. కడియం శ్రీహరికి 2014, 2018 ఎనిక్కల్లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటి చేసే అవకాశం రాలేదు. మరోవైపు గురువు శిష్యులు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినా ప్రత్యర్థులుగానే ఉన్నారు. ఎన్నికలు వచ్చినా ప్రతిసారి కడియం శ్రీహరి తన కూతుర్ని వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆరూరి రమేష్ సైతం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కడియం శ్రీహరి కూతురి కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో టికెట్ రాదని గ్రహించిన ఆరూరి బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చినా.. ఓటమి తప్పదని గ్రహించిన కడియం శ్రీహరి కొద్దిరోజులకే తన కూతురు కావ్యతో కలిసి బీఆర్ఎస్ లో చేరి టికెట్ సాధించుకున్నారు. కడియం కావ్య బరిలో ఉన్నప్పటికీ.. వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో గురువు వర్సెస్ శిష్యుడి రాజకీయం కొనసాగనుంది. గురువు పైచేయి సాధించి.. ఆరూరి రమేష్ ను ఓడించడం కోసం కడియం శ్రీహరి తన రాజకీయ చాణిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన వారసురాలైన కడియం కావ్యను చట్టసభల్లోకి పంపడం కోసం అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎలక్షన్ వార్
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటించకపోవడంతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. దీంతో శిష్యుడు బీజేపీ, గురువు కూతురు కాంగ్రెస్ అభ్యర్థిగా తమ అదృష్ణాన్ని పరీక్షించుకోనున్నారు. ఎలాగైనా కావ్య నెగ్గాలని కడియం శ్రీహరి తన 30 సంవత్సరాల రాజకీయ అనుభవానికి పదును పెట్టారు. కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నా.. కడియం కావ్యను అభ్యర్థిగా కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంగీకరించక పోవడం మైనస్ పాయింట్. కావ్య గెలుపు నల్లేరు పై నడక అని కాంగ్రెస్ నేతలు చెబుతుంటే.. కడియం శ్రీహరి, కావ్యలపై ఉన్న వ్యతిరేకత బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు కలిసి వచ్చే అంశంగా మారనుంది.