Kusuma Jagadish Death: ఉద్యమ నేత, ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ అంత్యక్రియలకు మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ లు హాజరయ్యారు. వీరితో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కుసుమ జగదీష్ కు కడసారి వీడ్కోలు పలికారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై.. భారత రాష్ట్ర సమితి జెండాను కుసుమ జగదీష్ పార్థీవ దేహంపై కప్పి ఘన నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ లు కూడా జగదీష్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 










ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ గుండెపోటుతో ఆదివారం రోజు మృతి చెందిన విషయం తెలిసిందే. హన్మకొండలోని తన నివాసంలో ఉండగా జగదీష్ కు ఛాతీలో నొప్పి వచ్చింది. ఇది గమనించిన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే జగదీష్ కు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే జగదీష్ ప్రాణాలతో లేరని నిర్ధారించారు. ఏప్రిల్ ఒకటో తేదీనే జగదీష్ కు తొలిసారిగా గుండెపోటు వచ్చింది. అయితే భార్య రమాదేవి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలను కాపాడుకున్నారు. సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల ఆరోజు ప్రాణాలతో బయట పడినప్పటికీ... రెండు నెలల వ్యవధిలోనే మరోసారి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. జగదీష్ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి వచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు పెద్దఎత్తున వచ్చారు. అయితే జగదీష్ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం ములుగు జిల్లా మల్లంపల్లికి తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.