Telangana News | కూసుమంచి: ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. ఎన్నికల సమయంలో బెట్టింగ్ కాసి లక్షల్లో గెలుకునే వారు ఉంటారు, కోట్ల రూపాయాలు, ఆస్తులు, సర్వస్వం కోల్పోయే వారిని సైతం మనం చూస్తుంటాం. ఓ వివాహిత ఏపీ ఎన్నికల (AP Elections)పై కాసిన పందెం తన పుట్టింటికి ఐదేళ్లపాటు వెళ్లడానికి దారి తీసింది. తాజాగా ఐదేళ్ల తరువాత మరుసటి ఎన్నికల్లో తన ఛాలెంజ్ నెగ్గడంతో పుట్టింటికి వచ్చిన ఆమెకు స్థానికులతో పాటు కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.

Continues below advertisement


చంద్రబాబు సీఎం అవుతారని ఛాలెంజ్, ఓడిపోవడంతో 
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి (పుట్టినిల్లు) చెందిన మహిళ కట్టా విజయలక్ష్మీ. 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారని విజయలక్ష్మి భావించారు. కుటుంబసభ్యలతో చెప్పగా వారు ఆమె మాట నమ్మలేదు. దాంతో చంద్రబాబు సీఎం అవుతారని విజయలక్ష్మీ ఛాలెంజ్ చేశారు. కచ్చితంగా వైఎఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కుటుంబసభ్యులు సైతం పెందెం కాశారు. ఒకవేళ తాను ఓడితే పుట్టింటికి రానని, చంద్రబాబు గెలిచాకే అడుగుపెడతానని విజయలక్ష్మీ ఛాలెంజ్ చేశారు. 2019 ఎన్నికల్లో నెగ్గి జగన్ సీఎం కావడంతో పందెం ఓడిన విజయలక్ష్మీ గత ఐదేళ్ల నుంచి పుట్టింటికి వెళ్లడం లేదు.


చంద్రబాబు నెగ్గడంతో శపథం నెరవేర్చుకున్న మహిళ


2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. జూన్ 12న ఏపీ సీఎంగా ప్రమాణం సైతం చేశారు. ఈ ఎన్నికల్లో ఛాలెంజ్‌లో తాను నెగ్గడంతో ఐదేళ్ల తరువాత సొంత గ్రామం కేశవాపురం వచ్చారు విజయలక్ష్మీ. శపథం నెరవేరడంతో ఐదేళ్ల తరువాత పుట్టింటికి వచ్చిన ఆమెకు గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. శపథం నెరవేరడంతో ఆమెను సత్కరించారు. గ్రామంలోకి అడుగుపెట్టిన విజయలక్ష్మీ దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం తన పుట్టింటికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. విషయం తెలిసిన కొందరు ఇదెక్కడి అభిమానం రా నాయనా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Also Read: గనుల వేలంపై తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్, లేకపోతే తామే చేస్తామంటూ అలర్ట్