Mineral Blocks Auction in Telangana | తెలంగాణలోని గనుల వేలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. జూన్‌ 30వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఏ ఒక్క మినరల్‌ బ్లాక్‌కు తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించలేదని కేంద్ర గనుల శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ నెలాఖరులోగా కనీసం ఆరు బ్లాకులకు అయినా వేలం నిర్వహించాలని సూచించింది. లేదంటూ తామే ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 30లోగా ఆరు బ్లాక్‌లకు వేలం నిర్వహించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 11 బ్లాకుల జియోలాజికల్‌ నివేదికలను అందించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిలో ఐదు ఇనుప ఖనిజం, ఐదు సున్నపురాయి, ఒక మాంగనీస్‌ బ్లాకు ఉన్నట్టు వెల్లడించాయి. వీటిలో కొన్నింటికైనా ఈ నెలాఖరులోగా వేలం నిర్వహించాలని కేంద్రం సూచించింది. 


గుర్తు చేసినా పట్టని సర్కార్‌


ఈ గనుల వేలానికి సంబంధించి ఇప్పటికి అనేకమార్లు తెలంగాణ ప్రభుత్వానికి గుర్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని కేంద్రం అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక్క బ్లాక్‌ కూడా వేలం వేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 30 నాటికి ఖచ్చితంగా ఆరింటికి వేలం పూర్తి చేయాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఈ విషయంలో విఫలమైతే తామే ఆ ప్రక్రియను చేపడతామని కూడా స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం గనుల వేలానికి సంబంధించి జారీ చేసిన హెచ్చరికగానే భావించాలని చెబుతున్నారు.


మినరల్‌ బ్లాక్‌ వేలం ప్రక్రియ 2015లో ప్రారంభమైంది. 2021లో నిబంధనలను  సవరించారు. వాటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్ట గడువులోగా వేలం ప్రక్రియ పూర్తి చేయాలి. లేదంటే వాటిని నిర్వహించే అధికారం కేంద్రానికి సంక్రమిస్తుంది. కొత్త విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా 354 ప్రధాన మినరల్‌ బ్లాక్‌లను వేలం వేశారు. 48 చోట్ల ఉత్పత్తి ప్రారంభమైంది. తద్వారా ఆయా రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరిగింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం వీటి వేలం విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండడం వల్ల ఆదాయం తగ్గడంతోపాటు సాంకేతికంగానూ ఇబ్బందులు ఎదురవుతున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. 


ప్రతిపాదనలు ప్రభుత్వానికి


తెలంగాణలోని మేజర్‌, మైనర్‌ మినరల్‌ బ్లాకులను వేలం పద్ధతిలో కేటాయించేందుకు గనులశాఖ సిద్ధమైందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఖనిజాల వారీగా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినట్టు చెబుతున్నారు. ఇందులోమూడు సున్నపురాయి బ్లాకులు కాగా, మరో 12 చిన్న తరహా ఖనిజాలు ఉన్నట్టు చెబుతున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆమోదం రాగానే వేలం ప్రక్రియను నిర్వహించాలని మంత్రిత్వశాఖ భావిస్తున్నట్టు చెబుతున్నారు. వేలంలో అర్హత సాధించిన వారికి ఆయా గనులను 20 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఇప్పటికే ఖరారైనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై కాస్త సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి సర్కారు వేగంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.