Pawan Kalyan taking charge as Andhra Pradesh deputy CM | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు అని హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, జనసేన అభిమానులకు శుభవార్త వచ్చింది. జూన్ 19వ తేదీన బుధవారం నాడు పవన్ కళ్యాణ్ మంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఏపీ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను పవన్ కళ్యాణ్ కి కేటాయించడం తెలిసిందే. తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను తీసుకున్నామని పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ ప్రకటన సైతం విడుదల చేశారు. 


జనసేన మంత్రులకు కీలక శాఖలు 
ఏపీ మంత్రివర్గంలో టీడీపీ 21, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 3 పదవులు, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. పవన్ తో పాటు జనసేన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కింది. నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కాగా, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ సేవలు అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తన అసెంబ్లీ గేటు తాకనివ్వను అని ఛాలెంజ్ చేసిన వారిని ఎన్నికల ఫలితాల్లో కనుచూపు మేరలో లేకుండా చేశారు.


ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీయే కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. వైనాట్ 175 అన్న వైసీపీ ఈసారి 11 సీట్లకే పరిమితమైంది. ఎన్డీయే కూటమి 164 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. టీడీపీ 135, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది. గత ఎన్నికల్లో రెండు పోటీ చేసి ఓడిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పవన్ గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.