AP Grama Volunteers New Guidelines: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త వినిపించబోతుందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల జీతాలను రూ.10 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. జూన్ 12న  సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్ల గురించి మాట్లాడుతూ.. వాలంటీర్లను ఎవర్నీ తొలగించేది లేదని చెప్పారు. వారికి నెలకు రూ.10,000 ఇస్తామని చెప్పారు. అయితే ఎప్పటి నుంచి ఇస్తారో మాత్రం చెప్పలేదు. జులై నుంచి ఇస్తారనే భావిస్తున్నారు. తాజాగా ఈ విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాలంటీర్లకు పెట్టబోయే మార్గదర్శకాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో  ప్రచారం కొనసాగుతోంది. 


మార్గదర్శకాలు ఇలా..


➥ వాలంటీర్ ఉద్యోగాలకు అర్హులైనవారు 1994-2003 మధ్య జన్మించి ఉండాలి.
➥ వాలంటీర్లకు ప్రస్తుతం జీతంగా రూ.5000 ఇస్తుండగా.. దాన్ని రూ.10,000 పెంచనున్నారు.
➥ ఉద్యోగాలకు అర్హత పొందినవారు గ్రామ పరిధి నుంచి మండల పరిధి వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 
➥ ప్రతిగ్రామానికి 'సంక్షేమ నిధి' ఏర్పాటు
➥ పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్‌ను బ్యాంకు ఖాతాల్లోనే జమచేయడంపై పునరాలోచన.



దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీలో వాలంటీర్లు ఏప్రిల్, మే నెల పింఛన్ సైతం లబ్ధిదారులకు పంపిణీ చేయలేకపోయారు. మరోవైపు ఈసీ ఆదేశాలు తోడవడంతో వాలంటీర్లు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనలేకపోవడం, ప్రచారం చేయడానికి వీలు కాకపోవడంతో సమస్య మొదలైంది. వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన వాలంటీర్లను ఈసీ ఆదేశాలతో కలెక్టర్లు, అధికారులు సస్పెండ్ చేశారు. వైసీపీ కోసం పనిచేయాలని భావించి స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. రాజీనామా చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు. జగన్ ను మరోసారి గెలిపించాలని ప్రచారం చేయడం తెలిసిందే.


గత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇలా..


➥ గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి అర్హత కలిగి ఉండాలంటే.. అభ్యర్థుల వయసు 18-35 సంవత్సరా మధ్య ఉండాలి. 
➥ గిరిజన ప్రాంతాల్లోని అభ్యర్థులు 10వ తరగతి, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు ఇంటర్మీడియట్, పట్టణ ప్రాంతాల్లోని అభ్యర్ధులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
➥ దరఖాస్తుదారులు సంబంధిత గ్రామపంచాయితీ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న వారై ఉండాలి. 
➥ వాంటీర్లకు రూ.5000 గౌరవ వేతనం.


వాలంటీర్ల విధులు..


➥ కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం.
➥సంక్షేమ పథకాలు పొందడానికి అర్హత ఉండి, ఆ పథకం అందనప్పుడు వారికి అవగాహన కల్పించాలి.
➥ ప్రభుత్వ పథకాలు, సహాయాన్ని ఇంటివద్దకే వెళ్లి అందించాలి. 
➥ తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం.
➥ లబ్ధిదారుల ఎంపిక, వినతుల పరిష్కారం ఆయా శాఖలకు సహాయకారికి వ్వవహరించడం.
➥ లబ్ధిదారుల వివరాలు, ఇతరత్రా సాయం పొందిన కుటుంబాల వివరాలను రికార్డు రూపంలో భద్రపరుచుకోవాలి.  
➥ తమ పరిధిలోని ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్ తయారుచేసి అధికారులకు ఇవ్వాలి.
➥ విద్య, ఆరోగ్య పరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి.  
➥ రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీరు వంటి అంశాలు పరిశీలించాలి.