Trent Boult retirement: అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌(T20 World Cup)లో మరో దిగ్గజ ఆటగాడి శకం ముగిసింది. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌( Trent Boult ) తన చివరి అంతర్జాతీయ టోర్నమెంట్‌ అని న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ప్రకటించాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి మైదానంలో తనకు ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయని  ట్రెంట్‌ బౌల్ట్‌ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. న్యూజిలాండ్‌ అద్భుత ప్రదర్శన చేసిన తరంలో బౌల్ట్‌ కీలక ఆటగాడిగా గుర్తింపు పొందాడు. న్యూజిలాండ్‌ తరపున అనేక ఫైనల్స్‌లో పాల్గొన్నాడు. కానీ ఫైనల్స్‌లో నిరాశతో వెనుదిరిగాడు. 2014 నుంచి జరిగిన నాలుగు టీ 20 ప్రపంచకప్‌లలోనూ పాల్గొన్న బౌల్ట్‌.. ఇక 2024 టీ 20 ప్రపంచకప్‌ తనకు చివరిదని ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశాడు. ఉగాండపై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత బౌల్ట్ ఈ ప్రకటన చేశాడు. ఇప్పటికే బౌల్డ్‌ న్యూజిలాండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి వైదొలిగాడు. మరి ఇప్పుడు బౌల్ట్‌ వేరే ఫార్మాట్లలో కొనసాగుతాడా అన్నది తెలియాల్సి ఉంది.






 

భావోద్వేగ ప్రకటన

ఇదే నా చివరి టీ 20 ప్రపంచకప్‌.. నేను చెప్పాల్సింది ఇదొక్కటే అని బౌల్ట్‌ పత్రికా సమావేశంలో ప్రకటించాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎప్పుడూ గర్వకారణమే అని తెలిపాడు. న్యూజిలాండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించకపోయినా అంతర్జాతీయ లీగ్‌లలో మాత్రం ఆడతానని బౌల్ట్‌ ప్రకటించాడు. టీ 20 ప్రపంచకప్‌లో కివీస్‌ ఇంకో మ్యాచ్‌ మాత్రమే ఆడాల్సి ఉంది. ఇప్పటికే గ్రూప్‌ సీ నుంచి అఫ్ఘానిస్తాన్, వెస్టిండీస్ రెండు స్థానాలను కైవసం చేసుకుని సూపర్‌ ఎయిట్‌కు చేరడంతో న్యూజిలాండ్ సూపర్ ఎయిట్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించింది. పాపువా న్యూ గినియాతో న్యూజిలాండ్ చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఇదే బౌల్ట్‌కు చివరి మ్యాచ్‌ కానుంది. ఈ ప్రపంచకప్‌లో తాము కోరుకున్న ఆరంభం దక్కలేదని... దీనిని భరించడం చాలా కష్టమని రిటైర్మెంట్‌ ప్రకటన తర్వాత బౌల్ట్‌ తెలిపాడు. దేశం కోసం ఆడడం చాలా గర్వంగా ఉందన్న ఈ కివీస్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌... గత రెండు వారాలుగా తమకు ఏదీ కలిసి రాలేదని భావోద్వేగానికి గురయ్యాడు. 





 

టీ 20 కెరీర్‌ ఇలా

టీ 20 కెరీర్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌  2013 నుంచి 2024 వరకూ 60 మ్యాచులు ఆడాడు. పొట్టి క్రికెట్‌లో మొత్తంగా 227 ఓవర్లు బౌలింగ్ చేసిన బౌల్ట్‌ 81 వికెట్లు తీశాడు. బౌల్ట్‌ కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌ 13 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం. అంతర్జాతీయ టీ 20 కెరీర్‌లో రెండుసార్లు నాలుగు వికెట్లు తీసిన ఘనతను బౌల్ట్‌ సాధించాడు. అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 30వ బౌలర్‌గా ఈ కివీస్‌ పేసర్‌ నిలిచాడు. కేవలం 36 మ్యాచుల్లోనే 50 వికెట్ల మైలురాయిని దాటాడు. బౌల్ట్‌ అకస్మాత్తుగా తన కెరీర్‌కు వీడ్కోలు పలకడంపై జట్టు సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతని వ్యక్తిగత జీవితం ఫలప్రదంగా ఉండాలని అభిలాషించారు.