Pakistan Cricket Fans Troll: అలా టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) లీగ్‌ దశ నుంచి పాకిస్థాన్‌(Pakistan) నిష్క్రమించగానే.. ఇలా విమర్శల జడివాన ప్రారంభమైంది. మీరు ఇంకెప్పుడు మారుతారురా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పాక్‌ జట్టును ఆటాడేసుకుంటున్నారు. బాబర్‌ ఆజమ్‌(Babar Azam) నువ్వో సోషల్ మీడియా కింగ్‌ వంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందుకేనా ఆర్మీ దగ్గర మీరు ప్రత్యేక శిక్షణ తీసుకుందని మరికొందరూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌ అంటూ కూడా కామెంట్‌ చేస్తున్నారు. జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మరింత పెరిగాయి. పొట్టి ప్రపంచకప్‌ నుంచి వైదొలిగిన తర్వాత... బాబ్బాబు... మాకు మీరు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు... కాస్త సపోర్ట్‌ చేయండంటూ పాక్‌ ఆటగాళ్లు వేడుకుంటున్నారు.

 

విమర్శల జడివాన

టీ 20 ప్రపంచకప్‌ 2024 నుంచి పాకిస్థాన్‌ లీగ్‌ దశలోనే వెనుదిరగడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఓటమే ఈ నిష్క్రమణకు ప్రధాన కారణమని మండిపడుతున్నారు. పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌ కనీసం లీగ్‌ దశ దాటకపోవడానికి జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లే కారణమని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌ ఆటగాడు అహ్మద్ షెహజాద్ డిమాండ్‌ చేశాడు. ఇలాంటి ఆటగాళ్లను పెట్టుకుని పాక్‌ క్రికెట్‌ భవిష్యత్తును ఊహించుకోలేమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్‌ సారధి బాబర్ ఆజం.. స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌లతో సహా సీనియర్ ఆటగాళ్లపై వేటు వేసి యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డును షెహజాద్‌ డిమాండ్‌ చేశాడు. ఈ ప్రపంచకప్‌నకు ముందు ఆటగాళ్లు తమను తాము మార్చుకోవడానికి... ఫామ్‌లోకి రావడానికి తగినంత సమయం ఇచ్చారని అయినా వాళ్లల్లో అసలు మార్పే రాలేదని ఫైర్ అయ్యాడు. బాబర్ తన కోటరిలోని ఆటగాళ్లను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని.. పాక్‌ జట్టు అంతా ఇప్పుడు గ్రూప్‌ పాలిటిక్స్‌తో మునిగిపోయిందని కూడా  షెహజాద్ సంచనల ఆరోపణలు చేశాడు. నాలుగైదేశ్లుగా బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్  పాక్‌ జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారని.. కానీ వారు స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రమ చేయలేదని విమర్శించాడు. 

 

వ్యక్తిగత రికార్డుల కోసమే..

పాక్‌ జట్టులోని ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతున్నారని... అందుకే వరుస ఓటములు ఎదురవుతున్నాయని కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. పాక్‌ ఆటగాళ్ల వ్యక్తిగత మైలురాళ్ల కారణంగా పాక్‌ క్రికెట్‌ సర్వ నాశనమైందని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాబర్‌ సారధ్యంలో పాక్‌ జట్టులో రాజకీయాలు ఎక్కువయ్యాయని కూడా మండిపడుతున్నారు. గ్రూపిజంలో భాగమైన పాక్‌ జట్టులోని ఎనిమిది ఆటగాళ్లను జట్టునుంచి పీకి పారేయాలని కూడా షెహజాద్‌ డిమాండ్‌ చేశాడు. 

 

అక్తర్‌ పోస్ట్‌ వైరల్‌

టీ 20 ప్రపంచకప్‌ నుంచి పాక్‌ జట్టు నిష్క్రమించిన తర్వాత షోయబ్ అక్తర్(shohab akhtar) చేసిన వన్ లైన్ పోస్ట్ వైరల్ అవుతోంది. పాక్‌ జట్టు లీగ్‌ దశలోనే వెనుదిరగడంపై అక్తర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో పాక్‌ ప్రయాణం ముగిసింది అని అక్తర్‌ పోస్ట్ చేశాడు. దీని కింద నెటిజన్లు కామెంట్లతో పాక్‌ జట్టుపై మండిపడుతున్నారు.

 

మద్దతు ఇవ్వరూ..

టీ 20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే వైదొలిగినా తమకు మద్దతు ఇవ్వాలంటూ పాక్‌ స్పీడ్‌ స్టార్‌ షాహీన్ షా ఆఫ్రిది(shaheen shah afridi) అభిమానులను అభ్యర్థించాడు. జట్టు మంచిగా ఆడుతున్నప్పుడు అందరూ మద్దతు ఇస్తారని.. ఈ క్లిష్ట సమయంలోనే అభిమానుల మద్దతు అవసరమని అఫ్రీదీ అన్నాడు. తమది గల్లీ క్రికెట్ జట్టు కాదని.. మీ పాకిస్తాన్ జట్టు కూడా అని షహీన్‌ షా గుర్తు చేశాడు. ఈ సమయంలో తమకు మద్దతు ఇవ్వలేకపోతే, మీరు మీడియా లాగానే అవుతారని కూడా అఫ్రిది అన్నాడు.