South Africa vs Nepal T20 World Cup 2024 Highlights:  టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది.  పసికూన నేపాల్‌(Nepal)  దక్షిణాఫ్రికా(South Africa)ను చివరి బంతి వరకూ వణికించింది. వరల్డ్ కప్ లాంటి పెద్ద స్టేజ్‌లో నేపాల్ పెను సంచలనమే సృష్టించేది. అది కూడా సౌతాఫ్రికా లాంటి దిగ్గజ జట్టు మీద. పాపం జస్ట్ మిస్. ఒక్క పరుగు ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడిపోయారు నేపాల్ క్రికెటర్లు. సఫారీలపై గెలిచి చరిత్ర సృష్టించే అవకాశాన్ని నేపాల్‌ కొద్దిలో మిస్‌ చేసుకుంది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో నేపాల్‌ ఒక్క పరుగు కూడా చేయకపోవడంతో... ఆ దేశ అభిమానుల గుండె ముక్కలైంది. ఇదీ నామమాత్రపు మ్యాచ్‌ అయినా... అగ్ర జట్టు ప్రొటీస్‌పై గెలిచి చరిత్ర సృష్టించాలన్న తమ లక్ష్యానికి నేపాల్‌ కేవలం ఒకే పరుగు దూరంలో ఆగిపోయింది. 
 

వణికించిన నేపాల్‌ బౌలర్లు

గ్రూప్ డీలో సౌతాఫ్రికా తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఈ రోజు నేపాల్ తో ఆడింది. ఆ ఏముందిలే నేపాల్ బౌలర్లే కదా కుమ్మిపారేద్దాం అనుకున్న సఫారీలకు చుక్కలు కనిపించాయి. స్పిన్నర్ కుశాల్ భుర్టేల్, పేసర్ దీపేంద్ర సింగ్ ఇద్దరూ కలిసి సౌతాఫ్రికాను గడగడలాడించారు.  ఓపెనర్లు హెండ్రిక్స్, డికాక్ లు, మిడిల్ ఆర్డర్ లో డేవిడ్ మిల్లర్ ల పని దీపేంద్ర సింగ్ పడితే...అరివీర భయకంర బ్యాటరైన క్లాసెన్ తో పాటు మార్ క్రమ్, మారో జాన్సన్, రబాడా సంగతి భుర్టేల్ చూసుకున్నాడు. దీపేంద్ర మూడువికెట్లు, భుర్టేల్ నాలుగు వికెట్ల తో రాణించటంతో అనూహ్యంగా సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7వికెట్లు నష్టపోయి 115పరుగులు మాత్రమే చేయగలిగింది. . 116పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన నేపాల్..బౌలింగ్ లో రాణించిన కుశాల్ భుర్టేల్ ఆసిఫ్ షేక్ తో కలిసి చాలా కాన్ఫిడెంట్ గా ఛేజింగ్ ప్రారంభించాడు. కానీ సౌతాఫ్రికా షంసీ అద్భుతంగా బౌలింగ్ చేయటంతో 13.4ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 85పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగిన నేపాల్ అనూహ్యంగా వికెట్లు కోల్పోయింది. ఆసిఫ్ షేక్ 42పరుగులు, అనిల్ షా 27పరుగులతో మ్యాచ్ ను తుదివరకూ తీసుకువెళ్లారు. 18 ఓవర్లకు నేపాల్‌ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 98 పరుగులు. ఇంకా చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. 12 బంతుల్లో కావాల్సింది ఇక 16 పరుగులే. నేపాల్‌ విజయం ఖాయమని.. ప్రొటీస్‌కు పసికూన చేతిలో పరాభవం తప్పదని అంతా ఒక అంచనాకు వచ్చేశారు. 

 

చివరి ఓవర్‌ ఇలా..

నేపాల్‌ గెలవాలంటే చివరి ఓవర్‌లో ఎనిమిది పరుగులు చేయాల్సి వచ్చింది. టై కావాలంటే ఏడు పరుగులు చాలు. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉండడంతో మ్యాచ్‌ నేపాల్‌ సునాయసంగా గెలిచేలా కనిపించింది. దక్షిణాఫ్రికా బౌలర్‌ బార్ట్‌మన్‌ బాల్‌ అందుకున్నాడు. చివరి ఓవర్‌ తొలి బంతిని నేపాల్‌ బ్యాటర్‌ గుల్షన్‌ ఝా మిస్‌ చేశాడు. దీంతో సమీకరణం అయిదు బంతులకు ఏడు పరుగులుగా మారింది. ఆ తర్వాతి బంతి కూడా డాట్‌ పడింది. దీంతో సమీకరణం రెండు బంతులకు ఏడు పరుగులుగా మారింది. ఆ తర్వాతి బంతిని గుల్షన్‌ ఝా ఫోర్‌ కొట్టడంతో నేపాల్‌ చరిత్ర సృష్టించేలా కనిపించింది. చివరి మూడు బంతుల్లో మూడే పరుగులు కావాలి. ఆ తర్వాతి బంతికి గుల్షన్‌ డబుల్ తీయడంతో ఇక మిగిలిన రెండు బంతుల్లో నేపాల్‌ విజయానికి రెండు పరుగులు కావాల్సి వచ్చింది. ఆ కానీ ఆ తర్వాతి బంతిని బార్ట్‌మన్‌ డాట్‌ వేయడంతో ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది. ఇక చివరి బంతికి ఒక పరుగు చేస్తే టై... రెండు పరుగులు చేస్తే విజయం నేపాల్‌ను వరించనుంది. ఈ దశలో బార్ట్‌మన్‌ వేసిన బంతిని ఝా ఆడడంలో విఫలమయ్యాడు. బంతి కీపర్‌ వద్దకు వెళ్లింది. డికాక్‌ దానిని బౌలింగ్‌ ఎండ్‌ వైపు విసరడంతో ఝా రనౌట్‌ అయ్యాడు. దీంతో ప్రొటీస్‌ కేవలం ఒకే పరుగు తేడాతో విజయం సాధించగా.. నేపాల్ గుండె బద్దలైంది.