Stadium Demolition in New York: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో టీ20 ప్రపంచకప్ కోసం తాత్కాలికంగా నిర్మించిన నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పూర్తిగా నేలమట్టం కానుంది. ఈ స్టేడియం కూల్చివేత పనులు శుక్రవారం నుంచే ప్రారంభమయ్యాయి.  మరో నాలుగు వారాల్లో దీన్ని పూర్తిగా ఇక్కడి నుంచి తొలగించనున్నారు. దాదాపు రూ. 250 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని కేవలం ఈ ప్రపంచకప్ కోసమే న్యూయార్క్ లోని ఓ ప్రాంతంలో నిర్మించారు.  దీన్ని ఇప్పటికిప్పుడు కూల్చివేయాల్సిన అవసరమేంటో ఇప్పుడు చూద్దాం. 


ఐసీసీ టీ 20 ప్రపంచకప్ వెస్టిండీస్ తో పాటు అమెరికాలో నిర్వహించాలని 2021లో నిర్ణయించారు. దీంతో 2023 జూలై నుంచి దేశంలోని స్టేడియంల అందుబాటుపై కసరత్తు జరిగింది. న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడాల్లో మూడు వేదికలను ప్రపంచకప్ నిర్వహణకు ఎంపిక చేశారు. అయితే న్యూయార్క్ లో తొలుత వాన్ కోర్ట్ ల్యాండ్ పార్క్ లో స్టేడియం నిర్మించి మ్యాచ్ లు నిర్వహించాలని భావించినా స్థానిక పర్యావరణ ప్రేమికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో అది సాధ్యం కాలేదు.  దీంతో న్యూయార్క్ లో ని మరో ప్రాంతంలో గల  ఐసన్ హోవర్ పార్క్‌లో తాత్కాలికంగా.. నాసౌ కౌంటీ  అంతర్జాతీయ క్రికెట్  స్టేడియాన్ని నిర్మించాలని ఐసీసీ భావించింది. నాసౌ కౌంటీలో ఇండో అమెరికన్ పౌరులు ఎక్కువగా ఉండటంతో అక్కడే ఈ స్టేడియం నిర్మిస్తే మంచి రెవిన్యూ వస్తుందని, క్రికెట్ అభిమానులకు సైతం వెసులుబాటు ఉంటుందని తీర్మానించి ఇక్కడే స్టేడియం కట్టాలని నిర్ణయించారు. కేవలం 106 రోజుల్లోనే స్టేడియాన్ని నిర్మించారు. 34 వేల మంది కూర్చొనేలా నిర్మించిన ఈ స్టేడియంలో మొత్తం 8 లీగ్ మ్యాచులు జరిగాయి. 


కూల్చివేత ఎందుకంటే.. 


ఐసీసీ ఊహించినట్లుగానే ఈ స్టేడియంలో ఇండియన్ అభిమానుల కోలాహలమే హైలైట్ అయింది. అయితే అస్ట్రేలియా నుంచి తెప్పించిన ఈ మైదానంలోని పిచ్‌లపై మాత్రం  తీవ్ర విమర్శలు వచ్చాయి.  టీ 20 ప్రపంచ కప్ లో మునుపెన్నడూ లేని  తక్కువ స్కోర్లు ఈ పిచ్ పై నమోదవ్వడం చూశారు.  బ్యాట్స్ మన్ హవా ఏమాత్రం సాగలేదు.  ఇప్పటి వరకూ ఈ పిచ్ పై ఎనిమిది మ్యాచులు జరగ్గా ఐర్లాండ్ పై కెనడా చేసిన 137 పరుగులే అత్యధిక స్కోర్ గా నిలిచింది.  అత్యల్పంగా శ్రీలంక 77 పరుగులకే ఆలౌటయింది. చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకూ సౌతాఫ్రికా ఆపసోపాలు పడింది.  అత్యధిక లక్ష్య ఛేదన ఇండియాదే. అమెరికాపై 111 పరుగులను 18.2 ఓవర్లలో భారత్ ఛేదించింది. ఇక సౌతాఫ్రికా ఇదే గ్రౌండ్ పై 113 పరుగులను కూడా డిఫెండ్ చేసుకుంది.


టీ20 క్రికెట్ కు భిన్నంగా అన్నీ లో స్కోరింగ్ మ్యాచులే. పెద్ద పెద్ద టీములు సైతం 150 కి మించి స్కోర్ చేయలేకపోవడంతో  బౌలర్ల ఆధిపత్యంతోనే మ్యాచ్ లన్నీ ముగిశాయి.  ఫలితంగా ఈ స్టేడియంలోని పిచ్ లపై క్రికెట్ అభిమానులతో పాటు నిపుణులు సైతం విమర్శలు గుప్పించారు. పిచ్‌తో పాటు అవుట్ ఫీల్డ్ సైతం మందకొడిగా ఉందని గుర్తించారు. ఈ స్టేడియాన్ని తాత్కాలికంగానే నిర్మించారు. కేవలం ఈ ఎనిమిది మ్యాచులు మాత్రమే ఈ వేదికపై నిర్వహించాల్సి ఉంది. బుధవారం జరిగిన భారత్ అమెరికా మ్యాచ్ సైతం అయిపోయింది కనుక ఈ స్టేడియాన్ని జూన్ 14న కూల్చివేత ప్రారంభించేందుకు ఐసీసీ నిర్ణయించింది. నాసౌ కౌంటీకి చెందని ఆ ప్రాంతం ఇంతకుముందు ఎలా ఉందోె అలా మార్చేందుకు బుల్డౌజర్లను పెద్ద ఎత్తున తీసుకొచ్చారు.  దాదాపు ఆరు వారాల్లో ఈ తాత్కాలిక స్టేడియాన్ని కూలగొట్టనున్నారు. ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన పిచ్ లు ఏంచేస్తారనే విషయంపై నాసా కౌంటీ  అధికారులే నిర్ణయించుకోవాలని ఐసీసీ చెప్పింది. 


నష్టం లేదు..


ఈ స్టేడియం నిర్మించాక జరిగిన మ్యాచుల్లో ఇండియా పాకిస్థాన్ మ్యాచే హైలైట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ ద్వారా మాక్సిమమ్ ఆక్యుపేషన్ పొందిన స్టేడియం.. రూ. 100 కోట్ల మేర ఐసీసీకి ఆదాయాన్ని సమకూర్చినట్లు చెబుతున్నారు. డిస్మాండిల్ చేసిన వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికే తరలిస్తారు కనుక.. ఈ స్టేడియాన్ని కూల్చడం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదని చెబుతున్నారు.