IND vs CAN  Preview and prediction: టీ 20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో సూపర్‌ ఎయిట్‌కు చేరుకున్న టీమిండియా(IND) నామమాత్రపు మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే గ్రూప్‌ ఏ నుంచి సూపర్‌ 8కు చేరుకున్న రోహిత్‌ సేన... పసికూన కెనడా(CAN )పై దండయాత్ర చేయనుంది. గ్రూప్‌ ఏలో భారత్‌ మూడు మ్యాచులు ఆడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా.. మూడు మ్యాచ్‌లు ఆడి ఒకే విజయం సాధించిన కెనడా నాలుగో స్థానంలో ఉంది. కెనడాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఉన్న సమస్యన్నింటినీ అధిగమించి పూర్తి ఆత్మ విశ్వాసంతో సూపర్‌ 8లో అడుగుపెట్టాలని భారత్‌ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. 


 

విరాట్‌ గాడిన పడతాడా..?

టీ 20 ప్రపంచకప్‌లో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో కెనడాతో టీమిండియా తలపడనుంది.   వరుసగా మూడు విజయాలతో సూపర్‌ ఎయిట్‌కు చేరుకున్న భారత్.. ఇప్పటివరకూ ఆడిన మ్యాచులన్నీ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే ఇప్పటివరకూ అమెరికాలో తలపడిన భారత్‌.. ఇక ఇప్పటినుంచి వెస్టిండీస్‌ పిచ్‌లపై తలపడనుంది. గెలిచిన మూడు మ్యాచులను అమెరికాలోనే ఆడిన భారత్‌... కరేబియన్‌ పిచ్‌లపై ఎలా రాణిస్తున్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు కింగ్‌ కోహ్లీపైనే ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ గెలిచిన మూడు మ్యాచుల్లోనూ విరాట్ పట్టుమని పది పరుగులు కూడా చేయలేదు. ఐపీఎల్‌ 2024లో విరాట్‌ 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో 700 పరుగులకంటే ఎక్కువ చేశాడు. కానీ పొట్టి ప్రపంచకప్‌లో కోహ్లీ వరుసగా విఫలం అవుతుండడం భారత్‌ను ఆందోళన పరుస్తోంది. అమెరికాపై డకౌట్‌ అయిన కోహ్లీ... 1.66 సగటుతో కేవలం అయిదు పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అయితే ఇప్పుడు అమెరికా నుంచి వెస్టిండీస్‌ చేరుకున్న కోహ్లీకి... అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి. ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేస్తున్న కోహ్లీ అంచనాలను అందుకోవడంలో విఫలమతుండడం అభిమానులను కూడా షాక్‌కు గురిచేస్తోంది. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ రాణిస్తుండడం భారత్‌కు కలిసి రానుంది. అమెరికాపై కీలక సమయంలో సూర్యకుమార్ యాదవ్‌, శివమ్‌ దూబే రాణించడం భారత్‌ను ఊరట పరిచింది. ఇక కీలకమైన సూపర్‌ ఎయిట్‌కు ముందు విరాట్‌ కూడా జోరందుకుంటే కప్పుపై భారత ఆశలు మరింత పెరిగినట్లే. అయితే సంజు శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఒకరిని జట్టులోకి తీసుకుంటారేమో చూడాలి. జైస్వాల్‌ను జట్టులోకి తీసుకురావాలంటే ఓపెనర్‌గా ఉన్న కోహ్లీని మళ్లీ వన్‌డౌన్‌కు పంపాలి. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ రాణిస్తుండడంతో ఆ విభాగంలో భారత్‌కు ఎలాంటి ఆందోళన లేదు. మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా కూడా రాణిస్తే బౌలింగ్‌ బలం పరిపూర్ణం కానుంది.

 

కెనడాకు అంత సీన్‌ ఉందా

ఈ ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై గెలవడం మినహా కెనడా ఎలాంటి అద్భుతాలు చేయలేదు. ఓపెనర్ ఆరోన్ జాన్సన్ వంటి ఆటగాళ్ళు తమదైన రోజున విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. అయితే భారత్‌పై అది సాధ్యం కావడం కష్టమే కావచ్చు. కనీసం భారత్‌కు పోటీ ఇచ్చినా కెనడాకు అది నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది.

 

జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. 

 

కెనడా: సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్‌), ఆరోన్ జాన్సన్, దిలోన్ హేలిగర్, దిల్‌ప్రీత్ బజ్వా, రిషివ్ జోషి, జెరెమీ గోర్డాన్, జునైద్ సిద్ధిఖీ, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తాత్‌గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, పర్గత్ సింగ్, రవీందర్‌పాల్ సింగ్, రవీందర్‌పాల్ సింగ్, రవీందర్‌పాల్ సింగ్ , శ్రేయాస్ మొవ్వ.